ఆయన పారితోషికం తీసుకోలేదు..!
తమిళసినిమా: ద్రౌపది – 2 చిత్రంలో నటించడానికి నటుడు రిచర్డ్ రిషి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్.జీ పేర్కొన్నారు. ఈయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన ద్రౌపది చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన చిత్రం ద్రౌపది – 2. నేతాజీ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత చోళ చక్రవర్తి జీఎం ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించిన చిత్రం ద్రౌపది – 2. నటి రక్షణ నాయకిగా నటించిన ఇందులో నట్టి నటరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేధీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చైన్నెలో నిర్వహించిన ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత చోళ చక్రవర్తి మాట్లాడుతూ చాలా ఏళ్లుగా చిత్రం చేద్దామని కథ కోసం ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు మోహన్.జీ మంచి కథతో వచ్చారన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను ఆయన 31 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. షూటింగ్‌ను ఉదయం 9 గంటలకు ప్రారంభించి రాత్రి 9 గంటల వరకూ షూటింగ్ నిర్వహించేవారని చెప్పారు. చిత్ర దర్శకుడు మోహన్.జీ మాట్లాడుతూ ఇది పిరియడికల్ కథా చిత్రం అని చెప్పారు. ద్రౌపది చిత్రం మాదిరిగానే ఈ చిత్రానికి సిన్సియర్‌గా పని చేశామని చెప్పారు. అందుకోసం చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. నటుడు రిచర్డ్ రిషి లేకపోతే ఈ చిత్రం లేదన్నారు. ఈ చిత్రం కోసం ఆయన ఇప్పటి వరకూ రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదన్నారు. అంతేకాకుండా గుర్రపు స్వారీ, కత్తి పోరాటాలలో శిక్షణ కోసం ఆయన రోజుకు 16 గంటల చొప్పున ఏడాది పాటు శ్రమించారని పేర్కొన్నారు. అదే విధంగా కథపై నమ్మకంతో ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే అధికం అయినా సపోర్ట్ చేసిన నిర్మాత చోళా చక్రవర్తికి ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రంలో నటించడానికి 25 మంది నటీమణులకు ఆడిషన్ చేసి చివరికి రక్షణను ఎంపిక చేసినట్లు చెప్పారు.ఆమె చాలా ధైర్యవంతురాలని, మంచి ప్రతిభను ప్రదర్శించారని చెప్పారు. రక్షణకు మంచి భవిష్యత్ ఉందనే అభిప్రాయాన్ని దర్శకుడు మోహన్ .జీ వ్యక్తం చేశారు.
ఆయన పారితోషికం తీసుకోలేదు..!


