వింటేజ్ బస్సు సేవలు
– చైన్నెలో విహారం
సాక్షి, చైన్నె: చైన్నె ఉలా (విహారం) పేరిట హాప్ ఆన్ హాప్ ఆఫ్ – వింటేజ్ బస్ సర్వీసెస్ సేవకు రవాణా మంత్రి శివశంకర్ బుధశారం జెండా ఊపారు. అన్నా స్క్వైర్ నుంచి ఈ బస్సును రోడ్డెక్కించారు. చైన్నె మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నేతృత్వంలో పురాతన బస్సుకు మెరుగులు తీర్చిదిద్దారు. చైన్నె ఉలా పేరిట పండుగ వేళ రోడ్డెక్కించారు. అద్భుతమైన చైన్నె నగరంలో పర్యాటక అనుభవాన్ని అందించే విధంగా ‘‘చైన్నె ఉలా’’ బస్సు – ‘హాప్–ఆన్ హాప్–ఆఫ్‘ సేవలతో రోడ్డెక్కించారు. తొలుత 5 బస్సులు పరిచయం చేశారు. ఇవి చైన్నె నడిబొడ్డున ఉన్న ఐకానిక్, సాంస్కృతిక ప్రదేశాలను అనుసాదించే విధంగా నడపనున్నారు. పురాతన వస్తువులు వారసత్వ సంపద కలిగిన ఈ బస్సులు 1980 కాలం నాటివి కావడం విశేషం. ప్రయాణికులు ఏ స్టాప్‌లో అయినా, ఈ బస్సులో ఎక్కవచ్చు, దిగవచ్చు అని అధికారులు సూచించారు. హాప్–ఆన్ హాప్–ఆఫ్( హెచ్‌ఓ అండ్ హెచ్‌ఓ) మోడల్ – యాక్సెస్, సౌలభ్యం ఇందులో అందుబాటులో ఉన్నాయి.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు, పాఠశాల విద్యార్థులకు ,పర్యాటకులకు ప్రయోజనకరంగాఈ బస్సు ఉంటుంది. ఈ సాంప్రదాయ బస్సు దివ్యాంగులు సులభంగా ప్రయాణించడానికి కూడా వీలు కల్పిస్తుంది.
బస్సులలో ప్రత్యేక సేవలు
చైన్నెలోని ప్రధాన చారిత్రక, సాంస్క్కతిక , వినోద ఆకర్షణలు, ల్యాండ్‌మార్క్‌లను కలిపే 30 కి.మీ పొడవైన రహదారి మార్గంలో సేవలకు చర్యలు తీసుకన్నారు. ఒకే టికెట్‌తో రోజంతా ప్రయాణించ వచ్చు. ఫీజు రూ. 50 మాత్రమే సెంట్రల్ రైల్వే స్టేషన్, ఎగ్మోర్ రైల్వే స్టేషన్, మెరీనా బీచ్‌ల వద్ద కండక్టర్ల నుంచి సంబంధిత టికెట్టు పొంద వచ్చు. అలాగే చైన్నె వన్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రయాణ టిక్కెట్లను పొందవచ్చు. పొంగల్ పండుగ సందర్భంగా ఈ సేవ జనవరి 16 నుంచి 18 వరకు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఈ బస్సులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుంది. వారపు రోజులు సాయంత్రం 4 నుంచి రాత్రి 11 వరకు, వారాంతాలు, ప్రభుత్వ సెలవుల రోజున ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు అందించనున్నాయి. బస్సు సర్వీసులు 30 నిమిషాలకు ఒకటి చొప్పున టైమింగ్ సిద్ధం చేశారు. ఇలాంటి పాతకాలపు బస్సులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కార్యక్రమంలో రవాణా శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చున్సోంగం, మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి. ప్రభు శంకర్, మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ , జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


