సహాయ దర్శకుల ఇతివృత్తంతో ‘ఎంజీ–24’
తమిళసినిమా: జీఆర్ సినీ వరల్డ్స్ పతాకంపై డా.రాజేంద్రన్ సమర్పణలో జయపాల్ స్వామినాథన్ నిర్మించిన చిత్రం ఎంజీ 24. ఈ చిత్రం ద్వారా ప్యార్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవతున్నారు. ఈయన ఇంతకు ముందు జీవీ.ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన కింగ్‌స్టన్ చిత్రంలోమాన్‌స్టర్ పాత్రలో నటించి పాపులర్ అయిన నటుడు అన్నది గమనార్హం. సిరకడిక్క ఆశైయా సీరియల్ ద్వారా పాపులర్ అయిన ప్రణవ్ మోహన్, స్ట్రైకర్ చిత్రం ఫేమ్ జస్టిన్ విజయ్ ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. వారికి జంటగా మయిలాంటి చిత్రం ఫేమ్ సువేదా నటరాజ్, ధనలక్ష్మీ.ఎం హీరోయిన్లుగా నటించారు. విచారణై చిత్ర కథా రచయిత ఆటో చంద్రన్, మలయాళ నటుడు అబ్దుల్ పషీల్ ప్రతినాయకులుగా నటించగా మిమ్మిశివ, అర్జన్ కార్తీక్, ప్రభాకరన్ నాగరాజన్, యువరాజ్. ఎస్, కాళీయప్పన్, సురేశ్ బాలాజీ,బార్బర్ బాలు, జయశ్రీ శ్రీధరన్, శీను తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. బి.బాలాజీ, నవీన్ కుమార్ ద్వయం ఛాయాగ్రహణం, సదాశివ జయరామన్ సంగీతాన్ని అందించారు. ఈయన సంగీతదర్శకుడు విద్యాసాగర్ శిష్యుడు కావడం గమనార్హం. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పిబ్రవరి 20న తెరపైకి రానుంది.దీని గురించి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇది సస్సెన్స్ , క్రైమ్,ఽ థిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. మిత్రులైన ఇద్దరు సహాయ దర్శకులు పాలక్కాడులో ఒక ఇల్లు కొనుగోలు చేయడానికి చైన్నె నుంచి వెళతారన్నారు. అయితే అక్కడ వారికి అనూహ్య సంఘటనలు ఎదురౌతాయన్నారు. అవి ఏమిటీ? వాటి నుంచి ఎలా బయట పడ్డారు? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం ఎంజీ 24 అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, పాలక్కాడు, కోవై ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు.


