క్లుప్తంగా
నగరాభివృద్ధికి ప్రాధాన్యం
సాక్షి, చైన్నె : చైన్నె నగరాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి కేఎన్ నెహ్రూ తెలిపారు. రూ.24.41 కోట్లతో తీర్చిదిద్దిన మాధవరం, మనలి చెరువు పరిసరాల్లోని పార్కు ఆయన ప్రారంభించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన బోటు షికారును మొదలుపెట్టారు. అధికారులతో కలిసి బోటులో విహరించారు. ఎంపీ కళానిధి వీరాస్వామి, మేయర్ ప్రియ, కమిషనర్ కుమర గురుబరన్ పాల్గొన్నారు.
మానసిక ఆరోగ్యంపై అవగాహన
సాక్షి, చైన్నె : మానసిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందని నిపుణులు తెలిపారు. బుధవారం శ్రీరామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో అప్‌లైడ్ టెక్నాలజీ విభాగం, ఫ్యాకల్టీ ఆఫ్ బిహేవియర్‌ః అండ్ సోషల్ సైన్సెస్, మద్రాసు స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సైకాలజీ విభాగంతో కలిసి బిహేవియరల్ రీసెర్చ్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ న్యూరో సోసల్ సైన్స్ సదస్సు నిర్వహించారు. మానసిక ఆరోగ్యం, న్యూరోసైన్స్ సావనీర్‌ను విడుదల చేశారు. న్యాయవాది అరుల్ మొళి, అసిస్టెంట్ ఐజీ గోమతి , ఎంఎస్‌ఎస్‌డబ్ల్యూ చైర్మన్ కేఏ మాథ్యూ, అప్‌లైడ్ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ కేవీ సోమ సుందరం, శ్రీహెర్ వీసీ ఉమా శేఖర్, రిజిస్ట్రార్ సెంథిల్‌కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ రాజా శామ్యూల్, ఫైనాన్షియల్ డైరెక్టర్ జాన్ జకారియా, డీన్ డాక్టర్ సుభాషిణి పాల్గొన్నారు.
ఇద్దరు కార్మికుల దుర్మరణం
తిరువొత్తియూరు: శివగంగై జిల్లా తిరుప్పాచెత్తి సమీపంలోని మడమత్తూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ చక్కెర కర్మాగారంలో ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. వివరాలు.. ఫ్యాక్టరీలో 500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. శివగంగైకి చెందిన పొన్నళగు (59), కరుంబావూరుకు చెందిన మోహనసుందరం (35) బుధవారం ఉదయం కర్మాగారంలోని మొలాసిస్ ట్యాంకును శుభ్రం చేయడానికి దిగారు. ఊపిరి అందక ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని శివగంగై ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కార్మికులు మాట్లాడుతూ కంపెనీలో సక్రమంగా భద్రతా ఏర్పాటుల లేవని ఆరోపించారు. దీనిపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఆస్పత్రి ఉన్నప్పటికీ అస్వస్థతకు గురైన కార్మికులకు ప్రథమ చికిత్స కూడా అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి సరైన సమాధానం చెప్పే వరకు మృతదేహాలను తీసుకెళ్లమని స్పష్టం చేశారు. ఈ మేరకు కార్మికులు ఆందోళనకు దిగారు.
నేడు గోదాదేవి
కల్యాణోత్సవం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : నగరంలోని టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలో గురువారం గోదా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈమేరకు బుధవారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా గోదా కల్యాణం నృత్య రూపకం ప్రదర్శించనున్నట్లు పేర్కొంది.
గోపూజ మహోత్సవం రేపు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం గోపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 5 నుంచి 10.30 గంటల వరకు వేణుగోపాల స్వామి వారికి అభిషేకం, పూజ, హారతి సమర్పణ చేపట్టనున్నారు. 10.30 నుంచి 11.15 వరకు గోపూజ, కటమ, అశ్వ, వృషభ, గజ పూజ జరిపించనున్నారు. 11.15 గంటల నుంచి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారుల భజన, కోలాటాలు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.27 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
క్లుప్తంగా


