అయ్యో.. ఎంత దారుణం, ఆరు వారాలకే ఆయుష్షు నిండింది.. | Sakshi
Sakshi News home page

అయ్యో.. ఎంత దారుణం, ఆరు వారాలకే ఆయుష్షు నిండింది..

Published Sat, Oct 8 2022 3:21 PM

Srikakulam: 6 Months Baby Dies In Road Accident Car Hits Auto - Sakshi

నరసన్నపేట(శ్రీకాకుళం): ఆరు వారాలకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది. కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన నరసన్నపేట మండలం యారబాడు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోమర్తికి చెందిన సింహాద్రి షర్మిలకు హైదరాబాద్‌కు చెందిన సత్యప్రభుతో 2020 ఆగస్టు 10న వివాహమైంది. ఈ ఏడాది ఆగస్టు 22న బాబు పుట్టాడు. నామకరణం చేసేందుకు బాలుడిని గత నెల 22న హైదరాబాద్‌ నుంచి కోమర్తికి తీసుకువచ్చారు.

బాబుకు వ్యాక్సిన్‌ వేయాలని స్థానిక ఆశా కార్యకర్త సూచించడంతో శుక్రవారం ఉర్లాం పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. వ్యాక్సినేషన్‌ అయ్యాక ఆటోలో ఇంటికి బయలుదేరారు. మరికొద్దిసేపటిలో గమ్యం చేరుకుంటారనగా కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. యారబాడు ముందు ఓ కారు అతివేగంగా వచ్చి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడితో పాటు మేనమామ శ్రీధర్, తల్లి షర్మిల కిందపడిపోయారు. ఆటో చక్రాల కింద బాలుడు ఇరుక్కోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందాడు. కళ్లముందే కుమారుడు దూరం కావడంతో తల్లి షర్మిల, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై నరసన్నపేట ఎస్‌ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే అసలు ట్విస్ట్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement