Sakshi News home page

Vizag Constable Suicide: తుపాకీతో కాల్చుకుని ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Published Sat, Apr 13 2024 7:33 AM

SPF Constable commits suicide In Visakhapatnam - Sakshi

ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

 ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో గార్డుగా విధులు

 బ్యాంకులోనే ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌తో కాల్చుకున్న శంకరరావు

 భర్త మృతదేహాన్ని చూసి భార్య కన్నీరుమున్నీరు

 ఆర్థిక వ్యవహారాలే కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు

విశాఖపట్నం: బంగారంలాంటి ఉద్యోగం.. సంతోషకరమైన కుటుంబం.. ఏం కష్టమొచ్చిందో.. తెల్లవారుజామున విధుల్లో ఉన్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ ఎస్‌ఆర్‌ఎల్‌ రైఫిల్‌ను గుండెకు గురి పెట్టుకుని కాల్చుకున్నాడు. క్షణాల్లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మొత్తం బ్యాంక్‌లోని సీసీ కెమెరాల్లో రిక్డాయింది. కానిస్టేబుల్‌ ఆత్మహత్య దృశ్యాలు ప్రతీ ఒక్కరి మనసును కలచివేశాయి. విధులు ముగించుకుని ఇంటికొస్తాడనుకున్న భర్త మరణవార్త తెలియడంతో భార్య గుండె పగిలిపోయింది.

బ్యాంకులో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న భర్తను చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తల్లి ఎందుకు రోదిస్తుందో తెలియని వయసులో చిన్నారులు పడిన వేదనను చూసిన వారి హృదయాలు ద్రవించిపోయాయి. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పాలవలస శంకరరావు(37) విధి నిర్వహణలో ఎస్‌ఎల్‌ఆర్‌ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలీస్‌ వర్గాల్లో సంచలనం రేపింది. వివరాలివీ..

విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిశ గ్రామానికి చెందిన పాలవలస శంకరరావు(37) భార్య శ్రావణి, కుమారుడు కిశోర్‌చంద్రదేవ్‌(6) కుమార్తె జ్ఞానవిత(3)తో కలసి మద్దిలపాలెంలో నివాసం ఉంటున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన శంకరరావు(3908) స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ద్వారకానగర్‌లో జ్యోతి బుక్‌ డిపో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో చెస్ట్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 5.55 గంటల సమయంలో తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ గన్‌తో గుండైపె గురి పెట్టుకుని ముందుకు వంగి కాల్చుకున్నారు.

ఈ శబ్దం విన్న తోటి ఉద్యోగులు వెంటనే వచ్చే చూసే సరికి శంకరరావు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. మృతి చెందినట్లు గుర్తించిన ఉద్యోగులు వెంటనే అధికారులు సమాచారం ఇచ్చారు. ద్వారకా ఏసీపీ రాంబాబు, సీఐ ఎస్‌.రమేష్‌, ఎస్‌ఐ ధర్మేంద్రతో పాటు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. భార్యకు సమాచారం ఇవ్వడంతో ఆమె పిల్లలతో ఘటనా స్థలం వద్దకు చేరుకుని రక్తపు మడుగులో ఉన్న భర్త మృతదేహన్ని చూసి కన్నీరుమున్నీరైంది. క్లూస్‌ టీం వేలి ముద్రలు సేకరించింది.

సీఐ ఎస్‌.రమేష్‌ సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏసీపీ ఆధ్వర్యంలో సీఐ దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాలే ఆయన ఆత్మహత్య కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కుట్టిసా గ్రామానికి ఆయన మృతదేహాన్ని తరలించారు.

ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమా? 
సీతమ్మధార: స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌ పాలవలస శంకరరావు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 2010లో పోలీస్‌ ఉద్యోగంలో చేరిన శంకరరావు హైదరాబాద్‌లో పనిచేశాడు. తర్వాత భద్రాచలంలో మూడేళ్లు పనిచేసి.. విశాఖపట్నానికి బదిలీపై వచ్చారు.

ఇక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మద్దిలపాలెంలో నివాసం ఉంటున్న శంకరరావు.. క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు ఇతర వ్యవహారాల కోసం అప్పులు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ క్రమంలోనే తోటి స్నేహితుడు వద్ద రూ.3.5 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. విజయగనరం జిల్లా వంగర మండలం కుట్టిశలో శంకరరావు దహన సంస్కారాలు పూర్తయ్యాయి. అతని అంత్యక్రియల కోసం పోలీస్‌ అధికారులు రూ.20 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు.    

Advertisement
Advertisement