కర్ణాటకలో అల్లర్లు.. సోషల్‌ మీడియా పోస్టుతో రగడ | Social media post triggers violence in Hubli, 40 arrested | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో అల్లర్లు.. సోషల్‌ మీడియా పోస్టుతో రగడ

Apr 18 2022 5:05 AM | Updated on Apr 18 2022 8:47 AM

Social media post triggers violence in Hubli, 40 arrested  - Sakshi

దాడిలో ధ్వంసమైన పోలీసు వాహనం

హుబ్బళ్లి: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక సోషల్‌ మీడియా పోస్టు భారీ విధ్వంసానికి కారణమైంది. కోపోద్రిక్తులైన ఒక వర్గం విధ్వంసానికి పాల్పడడంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆస్పత్రి, ఆలయం కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది. ‘నగరంలో ఈ నెల 20 దాకా 144 సెక్షన్‌ విధించాం. 40 మందికిపైగా అరెస్టు చేశాం. 12 మంది పోలీసులు గాయపడ్డారు’ అని హుబ్బళ్లి–ధార్వాడ్‌ పోలీసు కమిషనర్‌ లభురామ్‌ చెప్పారు.

సోషల్‌ మీడియాలో కొందరు పెట్టిన పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరికొందరు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై ఒకరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. అయితే ఇంతటితో తృప్తిపడని కొందరు ప్రజలు పోలీసు స్టేషన్‌ వద్ద గుమిగూడారని, వారిని చెదరగొట్టడం జరిగిందని వివరించారు.

అనంతరం అర్థరాత్రి సమయంలో మరలా చాలామంది గుమిగూడడంతో వారి నాయకులను పిలిపించి సదరు కేసులో తీసుకున్న చర్యలను వివరించామన్నారు. అయితే ఎంత నచ్చజెప్పినా వినకుండా ఈ మూక విధ్వంసానికి పాల్పడిందని లభురామ్‌ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అన్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా రాళ్లు పడి ఉండడాన్ని గమనించిన పోలీసులు ముందుగానే ట్రక్కు నిండా రాళ్లు, ఇటుకలు తెప్పించి ఉంటారని అనుమానిస్తున్నారు.

ప్లాన్‌ ప్రకారమే
హుబ్బళ్లిలో దాడి ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారమే చేశారని కర్ణాటక సీఎం బొమ్మై అభిప్రాయపడ్డారు. ఇలాంటివి సహించబోమని దీని వెనకున్నవారు గ్రహించాలని హెచ్చరించారు. దాడుల వెనక ఉన్నవారందరినీ అరెస్టు చేస్తామన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులుమవద్దని ప్రజలను కోరారు. స్టేషన్‌ ముందు ఒక్కమారుగా భారీగా జనాలు మూగారంటే అది ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిన ఘటనగా భావించాలన్నారు. గాయపడిన పోలీసుల్లో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు.

ఘటనకు సంబంధించి కొందరిని అరెస్టు చేశామని, దేవర జీవనహళ్లి, కడుగొండహళ్లి లాంటి చోట్ల జరిగిన విధ్వంసాన్ని ఇక్కడా చేయాలని కొందరు భావించారని చెప్పారు. విధ్వంసకారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంఎల్‌ఏలు డిమాండ్‌ చేశారు. ఘటనను మాజీ సీఎం కుమారస్వామి ఖండించారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement