గొడ్డళ్లతో పోలీసులపై స్మగ్లర్ల దాడి

Smugglers attack police with axes - Sakshi

ముగ్గురు స్మగ్లర్లు, 55 మంది తమిళ కూలీల అరెస్ట్‌ 

రూ.17.38 లక్షల విలువ చేసే 45 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు సీజ్‌ 

24 గొడ్డళ్లు, 3 బరిసెలు, 2 రంపాలు స్వాధీనం 

నెల్లూరు ఎస్పీ విజయారావు వెల్లడి

నెల్లూరు (క్రైమ్‌): నెల్లూరు–చిత్తూరు జిల్లాల మధ్య అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం వృక్షాలను నేలకూల్చి.. వాటి దుంగల్ని అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి వాహనాలను దూకించి.. గొడ్డళ్లు, బరిసెలు విసిరి వారిని చంపేందుకు యత్నించారు. ఆ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న పోలీసులు అతి కష్టంపై ముఠాలోని ముగ్గురు ప్రధాన నిందితులతోపాటు 55 మంది తమిళ కూలీలను అరెస్ట్‌ చేశారు. రూ.17.38 లక్షలు విలువైన 45 ఎర్రచందనం దుంగలను, ఓ లారీని, ఓ కారును, రూ.75,230 నగదు, 31 సెల్‌ఫోన్లు,  24 గొడ్డళ్లు, 3 బరిసెలు, 2 రంపాలను స్వాధీనం చేసుకున్నారు.  

పక్కా ప్రణాళికతో.. 
ఈ ఘటనకు సంబంధించి వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్‌ శిక్షణ కళాశాలలో జిల్లా ఎస్పీ సీహెచ్‌.విజయారావు ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరెగ్రాముకు చెందిన దాము అనే వ్యక్తికి ఆయిల్‌ ట్యాంకర్లు ఉండేవి. నష్టాల పాలైన దాము వాటిని అమ్మేశాడు. ఆ తరువాత తనవద్ద డ్రైవర్‌ పనిచేసిన తమిళనాడులోని వేలూరుకు చెందిన కుప్పన్‌ సుబ్రహ్మణ్యంతో కలిసి 5 నెలల క్రితం పాండిచ్చేరికి చెందిన ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌ పెరుమాళ్లు వేలుమలైను కలిశాడు. తాను ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తానని చెప్పడంతో వేలుమలై తన బావమరిది రాధాకృష్ణ పళనిని వారికి పరిచయం చేశాడు. వీరంతా కలిసి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం వృక్షాలను నరికి అక్రమంగా తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

ఈ నెల 20న పాండిచ్చేరి నుంచి 55 మంది తమిళ కూలీలు లారీలో తీసుకొచ్చారు. దాము, పళని, సుబ్రహ్మణ్యం కారులో వారికి ఎస్కార్ట్‌గా గూడూరు చేరారు. అక్కడ వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన చంద్రశేఖర్‌ను కలిశారు. చంద్రశేఖర్‌ అక్కడి నుంచి వారందరినీ రాపూరు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. కూలీలు ఎర్రచందనం వృక్షాల్ని నేలకూల్చారు. దీనిపై ఎస్పీ సీహెచ్‌ విజయారావుకు పక్కా సమాచారం అందటంతో ఆయన ఆదేశాల మేరకు ఈ నెల 21న పోలీసులు రాపూరు అటవీ ప్రాంతానికి చేరుకుని గాలించారు. పోలీసుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు అప్పటివరకు నరికిన ఎర్రచందనం దుంగలను పోలీసుల కంటపడకుండా లారీలో ఉంచి ఈ నెల 22న అటవీ ప్రాంతం నుంచి బయలుదేరారు. 

పోలీసుల్ని చంపేందుకూ వెనుకాడని దుండగులు  
పోలీసులు నిందితుల కోసం జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. చిల్లకూరు మండలం బూదనం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. దీనిని గమనించిన స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో పోలీసుల్ని ఢీకొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. లారీలోని తమిళ కూలీలు గొడ్డళ్లను పోలీసులపైకి విసిరి వారిని చంపేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top