ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ..

Siddipet: Harassed For Dowry, Pregnant Woman Suspicious death - Sakshi

సాక్షి, సిద్ధిపేట: వరకట్న వేధింపులకు గర్భిణి బలైంది. ఈ ఘటన సిద్దిపేట పట్టణం లెక్చరర్స్‌ కాలనీలో చోటుచేసుకుంది. వన్‌ టౌన్‌ సీఐ భిక్షపతి వివరాల ప్రకారం కాలనీకి చెందిన మామిడాల విజయలక్ష్మీ, వెంకటనర్సయ్య దంపతుల మూడో కూతురు నవ్య అలియాస్‌ దివ్య (29)కు ఏడేళ్ల క్రితం ముంబాయికి చెందిన ప్రదీప్‌కుందార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ముంబాయి నుంచి సిద్దిపేటకు వచ్చిన దివ్య, అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న బంజేరుపల్లికి చెందిన నాగరాజుతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

కాగా కట్నం తేవాలంటూ తరచూ నాగరాజు దివ్యను వేధిస్తుండేవాడు. నెల రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట గాంధీనగర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. దివ్య ప్రస్తుతం 8 నెలల గర్భిణి కావడంతో తండ్రి వెంకటనర్సయ్య బుధవారం ఉదయం దివ్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షల అనంతరం ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. రాత్రి నాగరాజు ఫోన్‌ చేసి దివ్య చనిపోయిందని చెప్పాడు.

దీంతో మహిళ కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి, అచేతనంగా పడి ఉన్న దివ్యను 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కట్నం తేవాలంటూ నాగరాజు తన కూతురుకు ఉరేసి చంపాడని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  
చదవండి: విద్యుత్‌శాఖలో మీటర్ల గోల్‌మాల్‌.. అసలు విషయం ఏంటంటే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top