భర్త పైశాచికం.. భార్య ఉరేసుకుంటుండగా వీడియో చిత్రీకరణ

Sadist Husband Video shooting while wife Hanging - Sakshi

చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

నెల్లూరు జిల్లాలో దారుణం

గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్టు

ఆత్మకూరు: కుటుంబ కలహాల కారణంగా భార్య ఉరి వేసుకుంటుండగా భర్త వీడియో చిత్రీకరించి పైశాచిక ఆనందం పొంది.. ఆమె మృతికి కారణమైన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండమ్మను ఆత్మకూరు పట్టణం దళిత కాలనీకి చెందిన మొద్దు పెంచలయ్యకు ఇచ్చి వివాహం చేశారు. పెంచలయ్య ఓ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొండమ్మ ఆత్మకూరు పట్టణంలోని మెప్మాలో రిసోర్స్‌పర్సన్‌గా పనిచేస్తున్నది. వీరికి ఇద్దరు మగపిల్లలు. 10 సంవత్సరాల వయస్సున్న రెండో కుమారుడు తరుణ్‌ గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. కొండమ్మపై భర్త పెంచలయ్య అనుమానం పెంచుకుని నిత్యం వేధిస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వారిద్దరూ గొడవపడ్డారు. ఈ సందర్భంగా పెంచలయ్య ‘నువ్వు చస్తేనే సమస్యలు తీరుతాయి’ అని అన్నాడు. దీంతో కొండమ్మ విరక్తి చెంది ఉరేసుకునేందుకు సిద్ధమయ్యింది. ఫ్యాన్‌కు చీర తగిలించి ఉరేసుకుంటూ ఉండగా ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరిస్తూ ‘ఉరేసుకో.. నేను ఆపను’ అంటూ ఆ కసాయి భర్త పైశాచిక ఆనందం పొందాడు. ఉరి బాగా బిగుసుకుపోవడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో పెంచలయ్య అక్కడినుంచిపరారయ్యాడు. గమనించిన సమీపంలోని స్థానికులు చూసి కొండమ్మను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందింది. వీడియో వైరల్‌ కావడంతో మెప్మా సిబ్బంది, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. తల్లి మృతి చెందడంతో తండ్రి దగ్గర లేకపోవడంతో చిన్నారులైన ధనుష్, తరుణ్‌  ఆస్పత్రి వద్ద దిగాలుగా కూర్చుని ఉండడం పలువురికి కంటనీరు తెప్పించింది.  

నిందితుడి అరెస్టు..
భార్య కొండమ్మ ఆత్మహత్య చేసుకుంటుండగా వీడియో చిత్రీకరించి పైశాచికానందం పొందిన మొద్దు పెంచలయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు బుధవారం రాత్రి ఆత్మకూరు డీఎస్పీ వెల్లడించారు. గురువారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top