మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ.. పట్టపగలే దారుణం

Rowdy Sheeter Assassinated In Visakhapatnam - Sakshi

ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మరో దారుణ హత్యతో విశాఖ నగరం ఉలిక్కిపడింది. గత కొన్ని రోజులుగా నగరంలో వరుస హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. పెందుర్తి ప్రాంతంలో హల్‌చల్‌ సృష్టించిన సైకో కిల్లర్‌ ఉదంతం మరువకముందే ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌ పరిధి ఆదర్శనగర్‌లోని అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఎదుట బుధవారం సాయంత్రం 4 గంటలకు మరో హత్య జరగడం చర్చనీయాంశమైంది.
చదవండి: మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు

ఈ ఘటనలో బొడ్డు అనీల్‌కుమార్‌ (35) అనే రౌడీషీటర్‌ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిగా మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక ప్రణాళిక ప్రకారం హతమార్చినట్లు గుర్తించారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ద్వారకా జోన్‌ ఏసీపీ ఆర్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. వాసుపల్లి శ్యామ్‌ ప్రకాష్‌ (34) అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అనీల్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తొలి నుంచీ నేర చరిత్రే... 
బొడ్డు అనీల్‌కుమార్‌ తన కుటుంబంతో కలిసి అప్పుఘర్‌ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు సంతానం. భార్య ఎంవీపీ కాలనీలోని ఓ ప్రైవేట్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. అయితే అనీల్‌కు తొలి నుంచి నేరచర్రిత ఉంది. దొంగతనాలు, పలు చైన్‌ స్నాచింగ్‌ కేసుల్లో నిందితుడు. చాలా కాలం భార్యభర్తలు కాకినాడలో నివాసమున్నారు.

ఆ సమయంలో అనీల్‌పై కాకినాడ పోలీసులు రౌడీషిట్‌ కూడా తెరిచారు. దీంతోపాటు అక్కడ పలు గొడవల్లో అనీల్‌ నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం క్రితం అనీల్‌ విశాఖకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బరంపురంలోని ఓ సంస్థలో ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చిన అనీల్‌కుమార్‌ బుధవారం హత్యకు గురవ్వడం పట్ల వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

గతంలో హత్యాయత్నం  
అనీల్‌తోపాటు ఈ హత్య కేసులో నిందితుడైన బాక్సర్‌ శ్యామ్‌కూ (శ్యామ్‌ ప్రకాష్‌) తొలి నుంచి నేరచరిత్ర ఉంది. శ్యామ్‌పై కూడా రౌడీïÙట్‌ ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిర్ధారించ లేదు. అయితే వీళ్లు ఇద్దరికీ తొలి నుంచి మనస్పర్థలు ఉన్నాయి. లోకల్‌ గ్యాంగ్‌ వార్‌తోపాటు ఒకరిపై ఒకరు హత్యా బెదిరింపులకు పాల్పడేవారు. ఈ క్రమంలో ఓసారి బాక్సర్‌ శ్యామ్‌ ఆదర్శనగర్‌ ప్రాంతంలోనే అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు. అనీల్‌ కళ్లల్లో కారం కొట్టి హతమార్చేందుకు యత్నించాడు. ఆ సమయంలో అనీల్‌ ఎదురు దాడికి దిగడంతోపాటు స్థానిక యువకులు అడ్డుకోవడంతో అనీల్‌ తప్పించుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్‌ను చంపేస్తానని పలుసార్లు అనీల్‌ బెదిరించేవాడు. దీంతో ఇరువురి మధ్య పరిస్థితి గ్యాంగ్‌ వార్‌గా మారడంతో స్థానిక యువకులు ఇద్దరినీ కూర్చోబెట్టి సెటిల్‌మెంట్‌ చేశారు. ఒకే ప్రాంతానికి చెందిన వారి మధ్య గొడవలు ఎందుకని సర్ది చెప్పారు. దీంతో ఇద్దరూ అయిష్టంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవద్దంటూ ఒప్పందం చేసుకున్నారు.

హత్యకు పక్కా ప్రణాళిక
ఇరువురి ఒప్పందం నేపథ్యంలో అనీల్, శ్యామ్‌ మధ్య కక్షలు కొన్ని రోజులుగా సద్దుమనిగాయి. అయితే అవకాశం కోసం ఎదురు చూసిన బాక్సర్‌ శ్యామ్‌కు బుధవారం మధ్యాహ్నం అనీల్‌ ఆదర్శనగర్‌లో ఓ వేడుక సందర్భంగా మద్యం సేవిస్తూ కనిపించాడు. దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని భావించిన బాక్సర్‌ శ్యామ్‌ అతని దగ్గరుకు వెళ్లి ‘‘మామా... నాకు ఏమైనా ఉందా..’’ అని అడగడంతో ఇద్దరూ కొంతసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.

ఈ క్రమంలో శ్యామ్‌ కోసం అనీల్‌ బీరు కూడా తెప్పించాడు. ఆ బీరు తాగిన అనంతరం అనీల్‌ కోసం ఆఫ్‌ బాటిల్‌ మద్యం తెప్పిస్తానని చెప్పిన శ్యామ్‌... వేరే యువకుడికి డబ్బులు ఫోన్‌ పే చేసి బాటిల్‌ తెప్పించాడు. పథకం ప్రకారం అది కూడా పూర్తిగా అనీల్‌తో తాగించాడు. అది పూర్తయిన అనంతరం మళ్లీ ఇరువురు చేరో క్వార్టర్‌ మద్యం తాగుదామంటూ బాక్స్‌ర్‌ శ్యామ్‌æ కోరడంతో అనీల్‌ సరేనన్నాడు. దీంతో ఇరువురు దగ్గరలోని అనుపమ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వచ్చారు. ఇద్దరూ చెరో క్వార్టర్‌ తాగి బయటకొచ్చారు. ఈ క్రమంలో అదును కోసం ఎదురుచూస్తున్న బాక్సర్‌ శ్యామ్‌ ఒక్కసారిగా అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు.

బీరు బాటిల్‌తో తలపై బలంగా కొట్టాడు. మద్యం మత్తలో ఉన్న అనీల్‌ తేరుకునే లోపే మరోసారి దాడికి పాల్పడ్డాడు. దీంతో అనీల్‌ కుప్పకూలిపోగా శ్యామ్‌ అతడిపైకి ఎక్కి తనతోపాటు తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా చాతీతోపాటు పలు చోట్ల పొడిచాడు. దీంతో అనీల్‌ శరీరంపై పదుల సంఖ్యలో కత్తిపోట్లు పడ్డాయి. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. స్థానికులంతా భయాందోళనకు గురై పారిపోయారు. అనీల్‌ అక్కడికక్కడే మృతి చెందగా వెంటనే బాక్సర్‌ శ్యామ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం రాత్రి నిందితుడు శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top