ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని..

Puducherry: Woman kills student over He Got More Marks Than Her Son - Sakshi

సాక్షి, చెన్నై:  తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడని ఓ విద్యార్థిపై ఆ తల్లి అసూయ పెంచుకుంది. చివరికి ఆ  విద్యార్థిని మట్టు మెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో ఓ ప్రైవేటు పాఠశాల ఉంది. ఇందులో రాజేంద్రన్, మాలతి దంపతుల కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఈ విద్యార్థి హఠాత్తుగా స్పహ తప్పి పడిపోయాడు. చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడి సిబ్బంది ఆస్పత్రికి సకాలంలో తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఆ బాలుడు విషం తాగినట్లు వైద్యుల పరిశీలన తేలింది. 

సెక్యూరిటీ ఇచ్చిన శీతలపానీయంతో..
ఆ పాఠశాల సెక్యూరిటీ ఇచ్చిన శీతల పానీయం తాగడంతోనే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు కోలుకున్న తరువాత తల్లిదండ్రుల దృష్టికి ఆ విద్యార్థి తీసుకెళ్లాడు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా, ఓ మహిళ తనకు కూల్‌డ్రింక్‌ ఇచ్చి ఆ విద్యార్థికి ఇవ్వాలని సూచించినట్లు వాంగ్ములం ఇచ్చాడు. డబ్బులకు కక్కుర్తిపడి తాను ఆమె చెప్పినట్లు చేశానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు.

ఓ మహిళ రెండు కూల్‌ డ్రింక్‌ బాటిళ్లను సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వడాన్ని గుర్తించారు. ఆ దృశ్యాల ఆధారంగా సహాయరాణి విక్టోరియా అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎప్పుడూ తరగతిలో ఫస్ట్‌ వచ్చే తన కుమారుడిని అధిగమించి రాజేంద్రన్, మాలతి కుమారుడు తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడని పోలీసులకు ఆమె వివరించింది. తన కుమారుడి కంటే అధికంగా మార్కులు సాధిస్తున్న ఈ విద్యార్థిపై తనకు ఈర్ష్య, కోపం పెరిగిందని, అందుకే విషం ఇచ్చి మట్టుబెట్టే ప్రయత్నం చేశానని అంగీకరించింది.  ఇది విని పోలీసులు కూడా నివ్వెరపోయారు. 
చదవండి: సినీ అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలు.. 30కి పైగా హార్డ్‌డిస్క్‌లు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top