వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ.. | Pregnant woman dies of electric shock in Wanaparthy District | Sakshi
Sakshi News home page

వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..

Jan 9 2022 5:52 PM | Updated on Jan 9 2022 6:28 PM

Pregnant woman dies of electric shock in Wanaparthy District - Sakshi

సాక్షి, గోపాల్‌పేట (వనపర్తి): నాలుగు నెలల ఆ గర్భిణి, కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా కాలం గడుపుతుండగా వాటర్‌ హీటర్‌ రూపంలో మృత్యువు గర్భిణిని కబళించింది. ఈ విషాదకర సంఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నవీద్‌ తెలిపిన వివరాలిలా..  బుద్దారానికి చెందిన అంజన్నమ్మ, తిరుపతిగౌడ్‌ కూతురు రవిసుధ (22)ను మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్‌కు ఇచ్చి వివాహం చేశారు.  వివాహ జీవితం సంతోషంగా సాగుతోంది.

వారికి ఇప్పటికే 14నెలల బాబు ఉండగా.. ప్రస్తుతం రవిసుధ నాలుగు నెలల గర్భిణి. ఈక్రమంలో రోజులానే ఇంట్లో శనివారం నీరు వేడి చేసేందుకు నీటితో నిండిన బకెట్‌లో హీటర్‌ను ఉంచారు. అదే సమయంలో ఇల్లు శుభ్రం చేస్తున్న రవిసుధ చెయ్యి అనుకోకుండా హీటర్‌ ఉంచిన బకెట్‌కు తగిలింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది.

చదవండి: (చిట్టమ్మ పెంచుకున్న పొట్టేలే.. ‘ఊపిరి’ తీసింది!)  

భర్త నరేందర్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా, రవిసుధ తల్లిదండ్రులు.. తమ కూతురు వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలన్న ఆశతో సొంత గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ, అనుకోని రీతిలో తమ కూతురు వారిని వీడిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement