టీడీపీ, జనసేన నేతల వీరంగం | Portraits of CMs YSR and Jagan were destroyed | Sakshi
Sakshi News home page

టీడీపీ, జనసేన నేతల వీరంగం

Jun 26 2024 5:23 AM | Updated on Jun 26 2024 5:23 AM

Portraits of CMs YSR and Jagan were destroyed

కార్లలో సైరన్‌ మోగించుకుంటూ ఎనికేపాడు పంచాయతీ కార్యాలయం వద్ద హడావుడి  

బాణసంచా కాల్చి కార్యాలయానికి టీడీపీ జెండా కట్టిన వైనం  

సర్పంచ్‌ రూమ్‌లో మాజీ సీఎంలు వైఎస్సార్, జగన్‌ చిత్రపటాలు ధ్వంసం  

కేక్‌ కట్‌చేసి గోడలకు, టేబుల్‌కు పులిమి రాక్షసానందం 

రామవరప్పాడు: విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ, జనసేన నాయకులు బరితెగించి విధ్వంసం సృష్టించారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో  11 మంది కార్లలో సైరన్‌ మోగించుకుంటూ వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. పార్టీ జెండాలు పట్టుకుని టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయం కింద బాణసంచా కాల్చి హడావుడి చేశారు. బలవంతంగా కార్యాలయం పైకి చేరుకున్నారు. సర్పంచ్‌ రూమ్‌లోకి చొరబడి గోడకు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలను ధ్వంసం చేశారు. 

మరోపక్క ఫ్లెక్సీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌చిత్రపటాన్ని పీకి పడేశారు. సర్పంచ్‌ టేబుల్‌పై కేక్‌ కట్‌చేసి టేబుల్‌కు, గోడలపైన పులిమారు. కార్యాలయం భవనానికి టీడీపీ జెండా కట్టి నినా­దాలు చేశారు. టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేస్తున్న సమయంలో పంచాయతీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్, కొందరు సిబ్బంది ఉన్నారు. కార్యాలయంలో విధ్వంసం గురించి సర్పంచ్‌ రాచమళ్ల పూర్ణచంద్రరావు, వార్డు, ఎంపీటీసీ సభ్యులకు సిబ్బంది సమాచారం అందించారు. 

వెంటనే కార్యాలయానికి చేరుకున్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా ప్రవర్తించడంపై భయాందోళనలకు గురైన  సిబ్బంది విధులు నిర్వర్తించలేమంటూ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ భాస్కరరావు, పటమట పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.  

పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం : సర్పంచ్‌ పూర్ణచంద్రరావు  
పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చెలరేగి ప్రవర్తించడంపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్‌ రాచమళ్ల పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఎనికేపాడు గ్రామంలో ఈ విధంగా గొడవలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారని చెప్పారు. పంచాయతీ కార్యాలయం గోడలపై మాజీ సీఎంలు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలతోపాటు వేరే పార్టీలకు చెందిన నాయకుల ఫొటోలు కూడా ఉన్నాయని తెలిపారు. 

కానీ వైఎస్సార్‌సీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వైఎస్సా­ర్, జగన్‌ చిత్రపటాలను, మాజీ ఎమ్మెల్యే వంశీ ఫ్లెక్సీని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉంటే త­­న­పైనా దాడిచేసేవారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక ఇటువంటి దారు­ణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇ­లా దాడులు చేస్తుంటే పంచాయతీ కార్యాలయంలో విధులు ఎలా నిర్వర్తించాలని ప్రశ్నించా­రు. ఈ ఘటనపై వెంటనే విచారించి దోషుల­పై  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

వైఎస్సార్‌సీపీ కార్యాలయాలకు కక్ష సాధింపు నోటీసులు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాష్టీకాలు 
ఏడు రోజుల్లో కట్టడాలు తొలగించాలంటూ హెచ్చరిక 
ఉండి/పార్వతీపురంటౌన్‌: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాల మీద కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వైఎస్సార్‌ విగ్రహాలు, ప్రభుత్వ భవన శిలాఫలకాలను ఓవైపు ధ్వంసం చేస్తుండగా.. మరోవైపు పార్టీ కార్యాల­యాలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. 

దీనిలో భాగంగానే మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం, పార్వతీపురం జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని కార్యాలయానికి సంబంధించి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేరిట నోటీసులు ఈ నెల 22న, 25న జారీ చేసినట్లు ప్రస్తుత, పాత తేదీల్లో ముద్రించి నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం గోడలకు అతికించారు. 

నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లో కట్టడాలను కూల్చాలని, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక జారీ చేశారు. అయితే పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రారంభించినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు.  

పల్నాడు జిల్లా కార్యాలయానికి నోటీసులు 
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల కాలనీలో సుమారు 1.5 ఎకరాల రెవెన్యూ స్థలంలో నిర్మించిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి పల్నాడు జిల్లా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ అధికారులు మంగళవారం నోటీసులు అంటించారు. 

తమ శాఖ ముందస్తు అనుమతులు తీసుకోకుండా పరిమితికి మించి భవన నిర్మాణం చేశారని, ఏడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని ప్లానింగ్‌ అధికారి భాస్కర్‌ పేరుతో ఉన్న నోటీసును పౌడా అధికారి రఘురామ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌ అంటించారు. ఎన్నికల ముందే భవన నిర్మాణం పూర్తికాగా, ఎన్నికల కోడ్‌ అడ్డు రావటంతో కార్యాలయాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కేవలం కక్ష సాధింపులో భాగమేనని వైఎస్సార్‌సీపీ నాయకులు భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement