పచ్చ ఖద్దరు చొక్కాల ముందు ..ఖాకీ యూనిఫాం తెల్లబోయిందా...!అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసు మాట తమ్ముళ్ల పాదాల కింద చిక్కి నలిగిపోయిందా..! అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. పండుగ మాటున పట్ట పగలే బరులు రూపుదిద్దుకుంటున్నాయ్... కోడి పందాలకు షామియానాలు లేస్తున్నాయ్.. జూదశాలల కోసం లక్షలు చేతులు మారుతున్నాయ్...అధికారం ఉందనే అహంకారమో.. పోలీసులు ఏం చేయలేరనే ధీమానోగానీ పచ్చ నేతలు బరి తెగించారు.
సాక్షి, పులివెందుల: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కోడి పందేలు, జూదాలు కొనసాగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటి నిర్వహణ ద్వారా టీడీపీ నాయకులు భారీగా సొమ్ము చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జూదాలను అరికట్టాల్సిన పోలీ సులు వారికి సహకరిస్తున్నట్లు సమాచారం.
పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగు, మురారిచింతల, పార్నపల్లె గ్రామా ల్లో టీడీపీ నాయకులు కోడి పందాలు నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోడి పందాలు, జూదాలు, గుండాట, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాల నిర్వహణకు ఉన్నతాధికారులు సైతం పర్మిషన్ ఇచ్చారని టీడీపీ నాయకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా వాటి నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఈ మేరకు గుండాట, పేకాట ఆడించేందుకు వివిధ ప్రాంతాల వారిచే నిర్వాహకులు డబ్బులు కూడా తీసుకున్నారని సమాచారం. డబ్బులు ఇచ్చిన వారు తప్ప వేరేవారు ఆడేందుకు వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నియోజకవర్గంలో భారీగా జూదాలు
లింగాల మండలానికి చెందిన టీడీపీ నాయకుడొకరు వారం రోజుల నుంచి జూదాలు నిర్వహించడానికి దొండ్లవాగులో 5నుంచి 7ఎకరాల స్థలాన్ని చదును చేశాడు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో జూదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షామియానాలను కూడా సిద్ధం చేశాడు. దీనికోసం జూద నిర్వాహకుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 14, 15, 16వ తేదీల్లో లోపల.. బయట అనే పేకాట (మంగతాయి) ఆడించేందుకు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి సదరు లింగాల మండల నాయకుడికి లక్షల్లో ముట్టజెప్పినట్లు సమాచారం. అలాగే అక్కడే గుండాట నిర్వహించడానికి కడపకు చెందిన వ్యక్తి టీడీపీ నాయకుడికి రూ.15లక్షలు సమరి్పంచినట్లు సమాచారం. ఇవే కాకుండా కోడి పందాల నిర్వహణలో ఇప్పటికే పందెం దారులు కోట్లల్లో పందాలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై కూడా టీడీపీ నిర్వాహకుడైన మండల నాయకుడికి లక్షల్లో సమరి్పంచినట్లు సమాచారం.
పోలీసులతో పనిలేదంటున్న టీడీపీ నాయకులు
జూదరులకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని సదరు టీడీపీ మండల నాయకుడు గట్టిగా భరోసా ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు తమను ఏమి చేయలేరని వారితో తమ నాయకుడు ముందుగానే మాట్లాడారని ఎలాంటి ఇబ్బంది ఉండదని, స్వేచ్చగా మూడు రోజులపాటు జూదం ఆడుకోవచ్చునని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున జూదం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
ఇంత జరుగుతున్నా ఖాకీలు కన్నెత్తి చూడడం లేదు. నిన్నా మొన్నటి వరకు సంక్రాంతి పర్వదినాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు విరివిరిగా ప్రచారాలు నిర్వహించారు. పైగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి జూదశాలలు నిర్వహించకూడదని, అలా జూదాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇదివరకే మీడియా సమావేశంలో హెచ్చరించారు. పులివెందులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒక లింగాల మండలంలోనే కాకుండా పులివెందుల మండలంలోని కొత్తపల్లె, అచ్చివెళ్లి ఇతర గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జూదశాలలు నిర్వహించేందుకు ఆయా మండలాలకు చెందిన టీడీపీ నాయకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పేకాటశాలలు వెలుస్తున్నా.. కోడి పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నా స్పందించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు పోలీసుల తీరును తూర్పారబడుతున్నారు.


