ఏపీలో నవీన్‌రెడ్డి?

Police Hunt For 3 People Accused In medical Student Kidnapping Case - Sakshi

ఒకటి రెండు రోజుల్లో అరెస్టు

వైద్య విద్యార్థిని కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మరో ముగ్గురి కోసం పోలీసుల వేట 

అడిషనల్‌ సీపీ నేతృత్వంలో ఆరు బృందాలు  

ఇబ్రహీంపట్నం రూరల్‌: వైద్య విద్యార్థిని కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా పరారీలో ఉన్న మరో ముగ్గురి నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అతనితో పాటు మిగిలిన ముగ్గురు వాడిన కారు కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. నిందితులు సెల్‌ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నవీన్‌రెడ్డి, పంజాబ్‌ ప్రాంతాల్లో రుమెన్, చందు, సిద్ధు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఇప్పటికే తెలంగాణ పోలీసులు నిందితులున్న ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం. నవీన్‌రెడ్డి మొదటి నుంచీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో దిట్ట అని తెలుస్తోంది. ఎప్పుడు ఫోన్లు వాడినా వాట్సాప్‌ ద్వారానే మాట్లాడే నవీన్‌రెడ్డి ఒకటి రెండు రోజుల్లో చిక్కే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

►ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధి మన్నెగూడలో నివసించే దామోదర్‌రెడ్డి, నిర్మల దంపతుల కూతురుపై దాడికి పాల్పడి, ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి, దాడికి పాల్పడిన 32 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్‌ కథ çసుఖాంతం అయినప్పటికీ ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మాత్రం నేటికీ పోలీసులకు చిక్కలేదు.

దీంతో రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న చోట జల్లెడ పట్టారు. నవీన్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కాగా, నవీన్‌రెడ్డిపై అతని స్వగ్రామంలో చీటింగ్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

రాష్ట్ర సరిహద్దులు దాటిన నిందితులు 
వైద్య విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన రోజు నవీన్‌ కుటుంబ సభ్యులను పోలీసులు గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. కనిపిస్తే ఎన్‌కౌంటర్‌ చేసే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు చెప్పడంతో నిందితుడు మాల్‌ నుంచి హాలియా మధ్యలో వైద్య విద్యార్థిని వదిలేసి వెళ్లాడు. నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో 9న కారును స్నేహితులకు వదిలేసి ద్విచక్ర వాహనం లిఫ్ట్‌ అడిగి పారిపోయినట్లు సమాచారం. నవీన్‌తో ఉన్న చందు, సిద్ధు, రుమెన్‌ కారుతో ఉడాయించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top