టీడీపీ నేత ఇంట్లో చోరీ.. ఘరానా దొంగలు అరెస్టు

Police have cracked a massive theft case that took place ten days ago - Sakshi

చిత్తూరు  టీడీపీ నేత ఇంట్లో చోరీ ఘటనలో 2 కిలోల బంగారు, రూ.2కోట్ల వజ్రాభరణాలు,రూ.10 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం

కిలో బంగారు.. వజ్రాలు అదనంగా రికవరీ చేసిన పోలీసులు

ఇద్దరు ఘరానా దొంగలు.. ఓ వ్యాపారి అరెస్టు 

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు తమ్ముడు బద్రినారాయణ ఇంట్లో పది రోజుల క్రితం జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడ్డ విశాఖకు చెందిన కర్రి సతీష్‌రెడ్డి(37), తెలంగాణ దేవరకొండకు చెందిన ఎన్‌.నరేంద్రనాయక్‌(26)తో పాటు వైఎస్సార్‌ కడపకు చెందిన కుదువ వ్యాపారి అనిమల కుమార్‌ ఆచారి (45)ను అరెస్టు చేశారు. చిత్తూరు నగరంలోని పోలీసు అతిథిగృహంలో వివరాలను ఎస్పీ ఎస్‌.సెంథిల్‌కుమార్, డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌రెడ్డి  శుక్రవారం మీడియాకు వివరించారు. గతనెల 28వ తేదీ తెల్లవారుజామున ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్మీనగర్‌ కాలనీలోని బద్రినారాయణ ఇంట్లో  చోరీకి పాల్పడ్డారు. కేసును ఛేదించడానికి డీఎస్పీ సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో క్రైమ్‌ సీఐ రమేష్, టూటౌన్‌ సీఐ యుగంధర్‌ను ఎస్పీ రంగంలోకి దింపారు.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో రెండేళ్లుగా నివాసం ఉంటున్న విశాఖజిల్లా కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీష్‌రెడ్డిని, ఇతనితో పాటు చోరీలో పాల్గొన్న తెలంగాణ నల్గొండకు చెందిన ఎన్‌.నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారించిన పోలీసులు రూ.3.04 కోట్ల విలువచేసే 2.03 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలు పొదిగిన గాజులు, బ్రాస్‌లెట్లు, వాచీలు, చెవికమ్మలు, హారాలు, నక్లెస్‌లు, బంగారు మొలతాడు, డాలర్లతో పాటు రూ.10 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, ఓ బుల్లెట్‌ వాహనం స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు గతేడాది ఆగస్టులో చిత్తూరులో జరిగిన మరోచోరీ కేసులో కూడా సతీష్‌రెడ్డి, నరేంద్ర పాల్గొన్నట్లు గుర్తించి అక్కడ చోరీకి గురైన 80 గ్రాముల బంగారు వడ్డాణం సీజ్‌ చేశారు.

చోరీ సొత్తు అని తెలిసినప్పటికీ బంగారు చైను కుదువపెట్టుకున్న నేరానికి కుమార్‌ ఆచారిని అరెస్టు చేశారు. కాగా, చోరీ జరిగినపుడు టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదులో రూ.2.57 కోట్ల విలువచేసే వస్తువులు మాత్రమే పోయినట్లు పేర్కొన్నాడు. కానీ పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నపుడు కేజీకి పైగా బరువున్న బంగారు, వజ్రాభరణాలు బద్రి ఇంట్లో చోరీ చేసినట్లు చెప్పడంతో వాటిని కూడా రికవరీలో చూపించారు. దీంతో వారికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top