పశువులపై విష ప్రయోగం

వైఎస్సార్ సీపీ ఎంపీటీసీపై ప్రత్యర్థుల కుట్ర
దూడ మృతి, మరో మూడు గేదెలకు అస్వస్థత
కృష్ణా జిల్లాలో ఘటన
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): రాజకీయ కక్షలతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని వీరవల్లి–1 సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు దూసరి నిర్మల (వైఎస్సార్ సీపీ)కు చెందిన పశువులపై విషప్రయోగం జరిగింది. ఈ ఘటనలో ఓ గేదె దూడ మృతి చెందగా, మరో మూడు గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. గ్రామంలో ఆదివారం ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన దూసరి నిర్మల, జోజి దంపతులు పాడి పశువులను పెంచుకుంటూ కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు.
కొంతకాలంగా రాజకీయంగా వారిద్దరూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని వారిపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇటీవల నిర్మల దంపతులు కౌలుకు సాగు చేసిన 16 ఎకరాల వరి కుప్పలను ప్రత్యర్థులు దహనం చేశారు. కాగా, శనివారం అర్ధరాత్రి నిర్మల ఇంటి ప్రాంగణంలోని గేదెలపై విషప్రయోగం జరగగా.. సంఘటనాస్థలంలోని ఆనవాళ్లును బట్టి చూస్తే దోసకాయ, వంకాయలలో గుళికల మందు కలిపి గేదెలకు పెట్టినట్లు తెలుస్తోంది.
సంఘటనాస్థలంలో పడి ఉన్న గుళికలు కలిపి పెట్టిన కూరగాయలు
ఆదివారం తెల్లవారుజామున నిర్మల యథావిధిగా పశువులకు మేత వేసేందుకు వెళ్లినపుడు పశువులన్నీ అపస్మారక స్థితిలో కనిపించాయి. స్థానికులు వీరవల్లి ప్రభుత్వ వైద్యశాల, సంచార పశువైద్యశాల సిబ్బందికి సమాచారం అందించటంతో వారు హుటాహుటిన పశువులకు వైద్యం అందించారు. దీంతో గేదెలకు ప్రాణాపాయం తప్పినట్లేనని పశు వైద్యులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరవల్లి ఎస్‌ఐ ఎం.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేశారు. గతంలో వరి కుప్పలు దహనం చేసిన వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడా? లేక వేరేఎవరైనా విష ప్రయోగం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు