పండగపూట విషాదం; కుమారుడి పుట్టినరోజు కేక్‌ కోసమని వెళ్లి

Person Lost Life Bringing Cake For Son Birthday In Penpahad Nalgonda - Sakshi

ఓ వైపు బక్రీద్‌ పర్వదినం.. మరో వైపు కుమారుడి పుట్టినరోజు వేడుక.. రెండు విశేషాలు ఒకే రోజు రావడంతో ఆ ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. తొలుత పర్విదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. సమీప బంధువుల రాకతో ఆ ఇంట్లో సందడి నెలకొంది. తదనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుక నిర్వహణకు కేక్‌ తెచ్చేందుకు సమీప బంధువుతో కలిసి వెళ్లిన తండ్రిని సిమెంట్‌ ట్యాంకర్‌ రూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో పండుగ పూట ఆ ఇంట పెను విషాదం అలుముకుంది.  

జుపెన్‌పహాడ్‌ : మండల కేంద్రానికి చెందిన షేక్‌ జమాల్‌(33)కు భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం బక్రీద్‌ పర్వదినంతో పాటు కుమారుడి పుట్టినరోజు కూడా కలిసి రావడంతో సంతోషించాడు. వేడుకకు సమీపం బంధువులను కూడా ఆహ్వానించాడు. ఉదయం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

కేక్‌ తెచ్చేందుకు వెళ్తుండగా..
మధ్యాహ్నం వరకు జమాల్‌ సంతోషంగా ఇంట్లోనే గడిపాడు. అనంతరం కుమారుడి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు, అందుకు అవసరమైన కేక్‌ తదితర సామగ్రి తీసుకువచ్చేందుకు బంధువు లతీఫ్‌తో కలిసి బైక్‌పై సూర్యాపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో సింగారెడ్డిపాలెం గ్రామ శివారుకు చేరుకోగానే సూర్యాపేట నుంచి గరిడేపల్లి వైపు వెళ్తున్న సిమెంట్‌ ట్యాంకర్‌ ఢీకొట్టడంతో  షేక్‌ జమాల్‌ అక్కడికక్కడే మృతిచెందగా షేక్‌ లతీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు పో లీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి యాకూబ్‌  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటరత్నం తెలిపారు. 

ఇనుప బోర్డును ఢీకొట్టి ఒకరు..
కోదాడ రూరల్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దోరకుంట సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.  వివరాలు.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన షేక్‌ బషీర్‌ (35) బైక్‌పై కోదాడ మండలం రామాపురం క్రాస్‌ రోడ్డు వద్దకు వచ్చాడు. బక్రీదు పండుగ సందర్భంగా చికెన్‌ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో   గ్రామశివారులోని పెట్రోలు బంకు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప బోర్డును ఢీకొట్టాడు.  తీవ్రంగా గాయపడిన బషీర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంషాద్‌ భేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ వై.సైదులు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top