సింధు నదిలోకి దూసుకెళ్లిన వ్యాన్‌: 17 మంది మృతి

Passenger Van Falls Into Indus River In Pakistan, 17 Life Ends - Sakshi

ఇస్లామాబాద్‌: ఘోర రైలు ప్రమాదం జరిగి 50 మంది మృతి చెందిన సంఘటన మరువకముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సింధు నదిలో వ్యాన్‌ పడిపోవడంతో 17 మంది దుర్మరణం పాలయ్యారు. సింధు నదిలో ప్రవాహం ఉధృతి ఉండడంతో మృతదేహాలు వెలికితీయడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఘటన ఆ దేశంలోని పానిబా ప్రాంతంలో జరిగింది. ఓ కుటుంబానికి చెందిన వారంతా వ్యాన్‌ అద్దెకు తీసుకుంటూ టూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

పాకిస్తాన్‌ చిలాస్‌కు చెందిన ఓ కుటుంబం వ్యాన్‌ను అద్దెకు తీసుకుంది. డ్రైవర్‌తో సహా మొత్తం 17 మందితో కూడిన వ్యాన్‌ చిలాస్‌ నుంచి రావల్పిండికి బయల్దేరింది. మార్గమధ్యలో కోహిస్తాన్‌ జిల్లాలోని పానిబా ప్రాంతానికి చేరుకోగానే వ్యాన్‌ అదుపు తప్పి సింధు నదిలోకి పడిపోయింది. డ్రైవర్‌తో సహా అందరూ మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వ్యాన్‌లో మృతదేహాలు కనిపించలేదు. ఆ ప్రవాహానికి మృతదేహాలు కొట్టుకుపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఒక మహిళ మృతదేహం మాత్రమే లభించినట్లు కోహిస్తాన్‌ పోలీస్‌ ఆరీఫ్‌ జావేద్‌ తెలిపారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top