వివాహేతర సంబంధం: నాలుగు కుటుంబాలకు నిలువనీడ లేకుండా చేసింది

Orissa: Four Families Boycott By Village Boy Extra Marital Affair With Married Women - Sakshi

సాక్షి,జయపురం: వివాహితతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణపై ఓ యువకుని కుటుంబంతో పాటు వారి బంధువులపై గ్రామస్తులు దాడి చేశారు. అక్కడితో ఆగకుండా వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేసి వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ సంఘటన నవరంగపూర్‌ జిల్లా ఝోరిగాం సమితి అకడహిల్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

నాలుగు కుటుంబాలు గ్రామ బహిష్కరణ
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అకడహిల్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో మూడు నెలల కిందట మహిళ కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తాళ్లతో కట్టేసి దండించారు. అనంతరం ఓ ఇంట్లో బంధించారు. సమాచారం అందుకున్న ఉమ్మరకోట్‌ పోలీసులు గ్రామంలో విచారణ చేసేందుకు రాగా, వివాహితపై ఆ యువకుడు అత్యాచారం చేశాడని మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళ బంధువులు అక్కడితో ఆగకుండా..యువకుని కుటుంబంతో పాటు వారి కులానికి చెందిన మరో మూడు కుటుంబాలపై దాడులకు పాల్పడ్డారు. ఇళ్లు ధ్వంసం చేశారు.

వారందరినీ గ్రామం నుంచి తరిమేశారు. ప్రాణభయంతో వారంతా గ్రామం విడిచిపెట్టి సమీపంలోని బాగడియా గ్రామానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ..యువకుడు తప్పు చేసి ఉంటే అతిడిని శిక్షించాలి. కానీ ఆ కులస్తులందరినీ హింసించి గ్రామం నుంచి బహిష్కరించడం, వారి ఇళ్లు ధ్వంసం చేయడం, ఆస్తులు దోచుకోవడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై ఉమ్మరకోట్‌ పోలీసు అధికారి నరేష్‌ కుమార్‌ ప్రధాన్‌ను సంప్రదించగా..యువకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామస్తులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top