కోర్టులో చోరీ చేసింది పాత నేరస్తులే 

Old criminals who stole in court - Sakshi

నెల్లూరు కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 

ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్లు స్వాధీనం 

వివరాలు వెల్లడించిన ఎస్పీ సీహెచ్‌ విజయారావు  

నెల్లూరు (క్రైమ్‌): నెల్లూరు నాలుగో అదనపు ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి శ్యామ్‌సంగ్‌ ట్యాబ్, లెనోవా ల్యాప్‌టాప్, నాలుగు సెల్‌ఫోన్లు, ఏడు సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో ఆదివారం ఎస్పీ సీహెచ్‌ విజయారావు కేసు పూర్వాపరాలను మీడియాకు వెల్లడించారు.  

సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా.. 
ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి దొంగలు కోర్టులోకి ప్రవేశించి రికార్డు రూమ్‌ బీరువాను పగులగొట్టి 521/2016 (నెల్లూరు రూరల్‌ పీఎస్‌) కేసుకు సంబంధించి భద్రపరిచిన ఆధారాల డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్ల బ్యాగ్‌ను అపహరించుకుని వెళ్లారు. 14వ తేదీ ఉదయం కోర్టు బెంచ్‌ క్లర్క్‌ బి.నాగేశ్వరరావు చోరీ ఘటనపై చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ఎస్పీ సీహెచ్‌ విజయారావు కావలి ఏఎస్పీ ప్రసాద్‌రావు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కోర్టుకు వచ్చే అన్ని రహదారుల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు బ్యాగ్‌తో అనుమానాస్పదంగా వెళ్లినట్లు గుర్తించారు. వీరు ఖుద్దూస్‌నగర్‌కు చెందిన పాతనేరస్తుడు సయ్యద్‌ హయాత్, అతని స్నేహితుడు పొర్లుకట్టకు చెందిన షేక్‌ రసూల్‌ అలియాస్‌ మస్తాన్‌గా నిర్ధారించారు. ఆదివారం నిందితులను ఆత్మకూరు బస్టాండ్‌ ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు.
 
ఐరన్‌ స్క్రాప్‌ దొంగతనానికి వెళ్లి..  
మద్యానికి బానిసలైన నిందితులు కుటుంబాలకు దూరమై నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద ఉంటూ దొంగతనాలు చేస్తున్నారు. హయత్‌ 15 కేసుల్లో నిందితుడు కావడంతో తరచూ కోర్టుకు వచ్చేవాడు. కోర్టు ప్రాంగణంలో ఇనుము స్క్రాప్‌ను దొంగలించేందుకు రసూల్‌తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి పాత జైలు మీదుగా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఇనుప స్క్రాప్‌ వద్దకు వెళ్లే సమయంలో కుక్కలు మొరగడంతో ఎవరో వస్తున్నారని భావించి కిందినుంచి కోర్టు మొదటి అంతస్తులోకి వెళ్లారు. అక్కడ గదికి ఉన్న తాళాన్ని ఇనుప రాడ్‌తో పగులగొట్టారు. లోపలకెళ్లి బీరువా తెరిచారు.

అందులో ఉన్న బ్యాగ్‌ను చూసి విలువైన వస్తువులు ఉంటాయని భావించి దానిని అపహరించారు. బ్యాగ్‌లోని ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకుని మిగిలిన పత్రాలను పక్కనే ఉన్న కాలువలో విసిరేశారు. ల్యాప్‌ట్యాప్‌ బ్యాగ్‌ను తమతో తీసుకెళ్లారు. ఈ మేరకు నిందితులు నేరం అంగీకరించడంతో వారిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. చోరీ ఘటనలో ఎలాంటి అపోహలకు తావులేదని, రాజకీయ ప్రమేయం లేదని విచారణలో తేలిందన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన కావలి ఏఎస్పీ ప్రసాద్, ఇన్‌స్పెక్టర్లు మధుబాబు, బాజీజాన్‌సైదా, శ్రీరామ్, వీరేంద్రబాబు, ఎస్‌ఐ సైదులు తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top