మరణంలోనూ వీడని బంధం..

Newly married Couple Died In Road Accident In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : పెళ్లి సమయంలో చేసిన బాసలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కలకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన ఆ దంపతులు అంతలోనే మృత్యు ఒడిలోకి చేరారు. పెళ్లయిన ఆర్నెళ్లకే ఆ నవదంపతులను లారీ మృత్యురూపంలో కబళించింది. వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ వారి ఆశలను చిదిమేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మందమర్రి మండలం గద్దెరాగడి గ్రామానికి చెందిన రుద్ర రాజయ్య–పద్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు స్వరాజ్‌(30). ఇతడికి పెద్దపల్లి జిల్లా జయ్యారం గ్రామానికి చెందిన మామిడాల శంకరయ్య కూతురు కృష్ణవేణి(23)తో గతేడాది జూన్‌ 11న వివాహమైంది. భార్యాభర్తలు గద్దెరాగడిలోనే ఉంటున్నారు. చదవండి :అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి..

ఈ క్రమంలో కృష్ణవేణి జిల్లాకేంద్రంలో కుట్టు నేర్చుకుంటోంది. స్వరాజ్‌ ఆమెను ప్రతిరోజూ కుట్టు శిక్షణ కేంద్రానికి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చి.. అనంతరం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఎప్పటిలాగే సోమవారం దంపతులిద్దరూ బైక్‌పై మంచిర్యాలకు బయల్దేరారు. ఏసీసీ అంబేద్కర్‌ కాలనీ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తూ.. వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవదంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై మారుతీ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: నిద్రిస్తున్నవారి పైకి దూసుకెళ్లిన ట్రక్కు..13 మంది మృతి

మరో 15 రోజుల్లో ఉద్యోగం..
రాజయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. స్వరాజ్‌ ఒక్కడే కుమారుడు. స్వరాజ్‌ కొంతకాలం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేశాడు. రాజయ్య సింగరేణి ఉద్యోగి కావడం.. మెడికల్‌గా అన్‌ఫిట్‌ కావడంతో తన ఉద్యోగాన్ని కుమారుడికి పెట్టించాడు. అప్పటినుంచి స్వరాజ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని ఇంటివద్దనే ఉంటున్నాడు. నెలరోజుల శిక్షణ పూర్తి చేసుకున్నాడు. మరో 15రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అంతలోనే మృత్యువు కబళించడంతో కుటుంబసభ్యులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. 

రోడ్డు భద్రత వారోత్సవాల రోజే..
రోడ్డు భధ్రత వారోత్సవాల రోజే ఈ ప్రమాదం జరగడం కలకలం సృష్టించింది. స్వరాజ్‌ హెల్మెట్‌ ధరించినా ప్రమాద సమయంలో బెల్ట్‌ ఊడిపోయిందని, దీంతో హెల్మెట్‌ ఎగిరిపోయి లారీ దంపతుల తలలపై నుంచి వెళ్లడంతోనే మృత్యుఒడికి చేరారని స్థానికుల ద్వారా తెల్సింది. స్వరాజ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top