తల్లి, భార్య వారించినా వినకుండా పార్టీకి వెళ్లి.. ఒక్క నిమిషమైతే ఇంటికి చేరుకునేవాడే!

New Year Tragedy: Two Youth Died In Road Accident Raghunadhapalem - Sakshi

నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే పోలీసులు అవగాహన కల్పించినా.. ఇంట్లో తల్లి ఎంతగా వారించినా.. ఫోన్‌లో భార్య ఎంత వేడుకున్నా.. వినకుండా బయట పార్టీకి వెళ్లారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికిన తర్వాత మృత్యువును కూడా ఆహ్వానించారు. బైక్‌ను వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి ఓ దుకాణంలోకి దూసుకుపోగా.. దానిపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడి తలలకు గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు.

సాక్క్షి, ఖమ్మం: చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులుగా ఉన్న వారిద్దరూ మృత్యువులోనూ బంధం వీడలేదు. నూతన సంవత్సరం ప్రారంభం రోజు ఎంతో ఆనందాన్ని నింపాల్సిన ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. తాము చెప్పినట్లు విని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆ యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడివారిని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన రఘునాథపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..

పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నగరంలోని పాండురంగాపురం గ్రామంలో పెయింటింగ్‌ కార్మికుడిగా పనిచేస్తున్న కట్ల పుల్లారావు (24), రఘునాథపాలెంలో నివాసం ఉండే, ఓ ప్రైవేట్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న (గతంలో ఇతను కూడా పెయింటింగ్‌ పనిచేసేవాడు) సాయి (25) ఇద్దరు స్నేహితులు. 2022 ఏడాది చివరి రోజు కాబట్టి తోటి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బయటకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. అనంతరం పుల్లారావు తన ద్విచక్రవాహనంపై సాయిని ఇంటి వద్ద దించేందుకు రఘునాథపాలెం చేరుకున్నాడు.

సెంటర్‌లో వేగంగా బైక్‌ నడుపుతూ అదుపుతప్పి ఓ దుకాణం మెట్లను ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కిందపడ్డారు. వారి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలియగానే రఘునాథపాలెం ఎస్‌ఐ ఎం.రవి సిబ్బందితో అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్‌ సందర్శించారు. 

పెళ్లి అయి ఏడాదే.. 
పుల్లారావుకు వెన్నెల అనే యువతితో ఏడాది కిందటే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. గత నెల 29న వెన్నెల తన పుట్టింటికి వెళ్లింది. తన భర్త పార్టీకి వెళ్తున్నట్లు గ్రహించిన ఆమె తన అత్తకు ఫోన్‌ చేసి పార్టీకి వెళ్లకుండా ఆపాలని వేడుకుంది. పుల్లారావుకూ ఫోన్‌ ద్వారా చెప్పింది. అయినా పుల్లారావు తన తల్లి, భార్య మాట వినకుండా బయటకు వెళ్లి వారు సందేహించినట్లుగానే మృత్యువాడ పడి తీరని శోకాన్ని మిగిల్చాడు. 

ఒక్క నిమిషమైతే.. 
ఇదే ప్రమాదంలో మరణించిన సాయి.. ఒక్క నిమిషమైతే ఇంటికి చేరుకునేవాడే. ఇంటికి అడుగుల దూరంలోనే ప్రమాదం జరిగి అతడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం సవ్యంగా వచ్చి ఉంటే ఇంట్లోకి చేరుకునే వాడని అతడి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. కాగా, సాయి రెండేళ్ల కిందట ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండు నెలల కిందట అతడికి పాప పుట్టింది. 

యువత ఆలోచనలో మార్పు మారాలి.. 
డిసెంబర్‌ 31న మిత్రులతో కలిసి పార్టీలు చేసుకోవడం.. మద్యం మత్తులో అతివేంగా వాహనాలపై రాకపోకలు సాగించడం.. లాంటివి చేయొద్దని పదే పదే ప్రచారం చేశాం. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా, పత్రికల ద్వారా అవగాహన కల్పించాం. ప్రధాన రోడ్ల వెంట భారీగా పెట్రోలింగ్‌ చేపట్టాం. అయినా ప్రమాదం జరగడం బాధాకరం. ఇలాంటి ఘటనలు చూసైనా యువత ఆలోచనలో మార్పు రావాలి. నియంత్రిత వేగంతో బైక్‌లు నడపటంతోపాటు హెల్మెట్‌ కచ్చితంగా ధరించాలి. 
– శ్రీనివాస్, రూరల్‌ సీఐ   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top