
సాక్షి, హైదరాబాద్: సినిమా పంపిణీదారుడు శివ గణేష్‌పై కడప జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి దౌర్జన్యం చేశాడు. శివ గణేష్‌ని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి భూ దస్త్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. తుపాకులు, కత్తులతో తన అనుచరులతో కలిసి హల్‌చల్ చేశాడు. ఈ ఘటన నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కొండారెడ్డి, అతని గ్యాంగ్‌లోని 10 మందిపై కేసు నమోదు చేశారు. తుపాకులు, కత్తులు చూపించి కొండారెడ్డి తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని శివ గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శామీర్‌పేట, కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాలపై కొండారెడ్డి గ్యాంగ్ బలవంతంగా సంతకాలు చేయించుకుందని తెలిపాడు.
నాలుగు టీమ్‌ల ఏర్పాటు
శివ గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారుంటూ కొండారెడ్డితో పాటు మరో పదిమందిపై శివగణేష్ ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. తుపాకులతో బెదిరించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు మొత్తం నాలుగు టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, బాధితుడు శివగణేష్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు.