డ్రగ్‌ వరల్డ్‌ @ ఆన్‌లైన్‌!

More Than Half Of The Citys Drug Menace Runs Through The Dark Net      - Sakshi

...ఇటీవల కాలంలో బయటపడిన ఈ రెండు ఉదంతాలే కాదు... నగరంలో జరుగుతున్న డ్రగ్స్‌ దందాలో సగానికి పైగా డార్క్‌ నెట్‌ ద్వారానే సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం మహేష్‌ బ్యాంక్‌ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.12.48 కోట్ల స్కామ్‌లోనూ డార్క్‌ వెబ్‌ పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్‌–న్యూలో పని చేస్తున్న సిబ్బంది, అధికారులకు ఈ కోణంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి.  

సాక్షి హైదరాబాద్‌:  మాదకద్రవ్యమైన ఎల్‌ఎస్డీ బ్లాట్స్‌ డార్క్‌ నెట్‌ నుంచి ఖరీదు చేసి, నగరంలో విక్రయిస్తున్న షాబాజ్‌నగర్, కూకట్‌పల్లి ప్రాంతాలకు చెందిన సయ్యద్‌ ఆసిఫ్‌ జిబ్రాన్, పి.తరుణ్‌లను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు గత నెల 24న పట్టుకున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా గుట్టును హెచ్‌–న్యూ ఫిబ్రవరి 26న రట్టు చేసింది. దీనికి సూత్రధారిగా ఉన్న విద్యార్థి నిమ్మగడ్డ సాయి విఘ్నేష్‌ డార్క్‌నెట్‌ నుంచి ఎల్‌ఎస్డీ బ్లాట్స్‌ ఖరీదు చేసి విక్రయించాడు.  

అదో ‘అక్రమ’లోకం
డార్క్‌ నెట్‌ లేదా డార్క్‌ వెబ్‌తో సమాజానికి, ఏజెన్సీలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మాఫియా ప్రపంచంలో మాదిరిగానే ఆన్‌లైన్‌లోనూ అధోజగత్తు ఉంది. కనిపించే అండర్‌వరల్డ్‌లో మాఫియా డాన్లు రాజ్యమేలితే... ఇంటర్‌నెట్‌లోని డార్క్‌నెట్‌/వెబ్‌గా పిలిచే అండర్‌గ్రౌండ్‌ వెబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా వంటి వ్యాపారాలు సాగుతుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటూ అక్రమ దందాలకు డార్క్‌ వెబ్‌ అడ్డాగా మారిపోయింది.  

నిఘాకు చిక్కకుండా ఉండేందుకు... 
కంప్యూటర్లలో వినియోగించే విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్‌నెట్‌లో ఉండే వెబ్‌సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చి, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాలు వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాలు ఇంటర్‌నెట్‌లోని అండర్‌ వరల్డ్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్‌ వెబ్‌’, ‘అండర్‌గ్రౌండ్‌ వెబ్‌’, ‘డార్క్‌ వెబ్‌’ అని పిలుస్తారు.

 ‘ఎంట్రీ’ సైతం ఈజీ కాదు.. 
ఏ వినియోగదారుడైనా విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో ఈ డీప్‌ వెబ్‌లోకి చొరబడటం సాధ్యం కాదు. ఈ అధోజగత్తులో అడుగుపెట్టాలంటే టెయిల్స్‌గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్‌ అనే ఆపరేటింగ్‌ సిస్టం సైతం ఇన్‌స్టాల్‌ అవుతుంది. వీటిని తమ కంప్యూటర్లలో ఏర్పాటు చేసుకుంటున్న పెడ్లర్లు తమ దందా కొనసాగిస్తున్నారు.

ఒకప్పుడు కేవలం ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ ద్వారానే యాక్సస్‌ చేసే డార్క్‌ వెబ్‌ను ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల నుంచీ ఆపరేట్‌ చేసేస్తున్నారు. ఇందులో ఉండే అనేక వెబ్‌సైట్, గ్రూపులను సంప్రదించి డ్రగ్స్, మారణాయుధాల సహా ఏదైనా ఖరీదు చేసేయవచ్చు. పోస్టు లేదా కొరియర్‌ ద్వారా వచ్చే ఈ ‘మాల్‌’ను అందుకోవడానికి తప్పుడు చిరునామాలు ఇచ్చి నేరుగా ఆయా ఆఫీసులకు వెళ్లి..నకిలీ ధ్రువీకరణలు చూపించి డెలివరీ తీసుకుంటూ తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

బిట్‌ కాయిన్స్‌ రూపంలో చెల్లింపులు... 
డీప్‌ వెబ్‌లోని వెబ్‌సైట్లలో ఆర్డర్‌ ఓ ఎత్తయితే దీనికి సంబంధించిన చెల్లింపులు మరోఎత్తు. ఈ లావాదేవీలు సైతం ఆన్‌లైన్‌లోనే క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్‌కాయిన్స్‌ రూపంలోనే సాగుతాయి. దీనికోసమూ ఇంటర్‌నెట్‌లో కొన్ని వెబ్‌సైట్స్‌ ఉన్నాయి. వాటిలోకి లాగిన్‌ కావడం ద్వారా ఓ ఖాతా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా నగదు చెల్లించి బిట్‌ కాయిన్స్‌ను తమ ఖాతాలోకి జమ చేసుకుంటారు. ‘డీప్‌ వెబ్‌’లో కొనుగోలు చేసిన ‘మాల్‌’కు అవసరమైన చెల్లింపులన్నీ ఈ బిట్‌కాయిన్స్‌ రూపంలోనే చేస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా విక్రయిస్తున్న, ఖరీదు చేస్తున్న వ్యక్తుల వివరాలు వేరొకరికే కాదు... ఒకరికొకరికీ తెలిసే అవకాశం ఉండదు. హెచ్‌–న్యూకు చిక్కిన పెడ్లర్స్‌ ఈ రకంగానే దందా చేస్తూ ఎల్‌ఎస్డీని ఖరీదు చేసి నగరంలోని వారికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.  

సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే
‘డీప్‌ వెబ్‌’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే అసాంఘిక శక్తులకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ తరహా కేసులు గతంలో ఇతర నగరాల్లో ఎక్కువగా వెలుగులోకి వచ్చినా... ఇటీవల కాలంలో నగరంలోనూ పెరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇలా ఆర్డర్‌ చేసిన డ్రగ్స్‌లో కొన్ని విదేశాల నుంచి మరికొన్ని ఉత్తరాది నుంచి వస్తున్నట్లు ఆధారాలు సేకరించామన్నారు.    

(చదవండి: డీజే.. డ్రగ్స్‌ రిస్క్‌!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top