
Son Killed Mother in Sangareddy: నవమాసాలు మోసిన కన్న తల్లినే పొట్టన పెట్టుకున్నాడొక కసాయి కొడుకు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలం పోతులబోగుడా గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ దశరథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ (55) పేరునున్న నాలుగెకరాల భూమిని తన పేరున రాయాలని, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వాలని కుమారుడు మురళి తాగివచ్చి రోజూ గొడవ పడేవాడు. తల్లిని ఎలాగైనా చంపి బంగారు ఆభరణాలు తీసుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో మురళి తన భార్యను ఆమె తల్లి ఇంటికి పంపించాడు.
బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి గొంతు నులిమి హతమార్చాడు. తర్వాత ఏమీ తెలియనట్టు చుట్టు పక్కల వారికి తల్లి అనారోగ్యంతో మరణించిందని నమ్మబలికాడు. గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. జోగిపేట సీఐ శ్రీనివాస్, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి అల్లుడు జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.