మహారాష్ట్ర ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: రష్మీశుక్లా వాంగ్మూలం నమోదు

Maharashtra Phone Tapping Case Rashmishukla Statement Recorded - Sakshi

నగరంలోని ఆమె కార్యాలయంలోనే రికార్డు 

రెండు రోజుల క్రితం పూర్తిచేసిన ప్రత్యేక బృందం 

సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రకు చెందిన ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సౌత్‌జోన్‌ స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి రష్మీశుక్లా నుంచి ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది.  

మహారాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన శుక్ల ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో ఉన్న సీఆర్పీఎఫ్‌ సౌత్‌ జోన్‌ కార్యాలయంలో పని చేస్తున్నారు.  

మహారాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగానికి నేతృత్వం వహించిన సమయంలో రష్మి మొత్తం 36 మంది రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

ఈ మేరకు నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ముంబై వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఆమెకు రెండు నోటీసులు జారీ చేశారు. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించిన రష్మీశుక్లా సదరు ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఆర్డర్‌ ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు.  

పిటిషన్‌ విచారణలో భాగంగా ఆ రాష్ట్ర హైకోర్టు మహారాష్ట్ర సర్కారుతో పాటు ముంబై పోలీసులకూ నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి న్యాయ స్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కేసు తదుపరి విచారణ వరకు రష్మీశుక్లాను అరెస్టు చేయమని స్పష్టం చేసింది.  

వాంగ్మూలం ఇచ్చేందుకు ఆమె ముంబై రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. త్వరలో ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసు బృందమే హైదరాబాద్‌కు వెళ్లి ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేస్తుందని తెలిపింది.  

ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చిన ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ప్రత్యేక బృందం రష్మి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకెళ్లింది.  ఈ తతంగం మొత్తం వీడియో రికార్డింగ్‌ చేసింది. వీటిని వచ్చే నెలలో ముంబై హైకోర్టుకు సమర్పించనున్నారు.  

గత ఏడాది ముంబై పోలీసు విభాగంలో బదిలీలకు సంబంధించి పైరవీలు చేస్తూ ప్రముఖులు సాగించిన బేరసారాలను ఫోన్‌ రష్మి ట్యాపింగ్‌ ద్వారా రికార్డు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగంలో పని చేస్తున్న ఐదుగురు అధికారులు సహాయంతో ఈమె ట్యాపింగ్‌ కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

మహారాష్ట్ర హోమ్‌ శాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసులోనూ రష్మీశుక్లా స్టేట్‌మెంట్‌ కీలకమైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top