
గదుల్లో చిక్కుకున్న విద్యార్థులు
సాక్షి, మైసూరు(కర్ణాటక): ట్రస్టు సభ్యులు వారిలో వారు గొడవపడి, కళాశాలకు వచ్చిన విద్యార్థులను గదుల్లో బంధించిన ఘటన నగరంలోని విజయనగరలో ఉన్న ప్రైవేట్ పీయూ కళాశాలల్లో మంగళవారంచోటు చేసుకుంది. ట్రస్టీలు వనితా, సలోని, రునాల్, రేణుకా, అశోక్ కుమార్ అనే ఐదుమంది ట్రస్టీలు ఉన్నారు. విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులు దుర్వినియోగం చేశారని వనితా, రేణుకాను ట్రస్టు నుంచి సస్పెండ్ చేశారు.
ఒక స్థలం విషయమై కూడా రేణుకాతో మిగతావారికి రగడ జరిగింది. రేణుకాకు చెందిన వారు రోజూ కళాశాల వద్దకు వచ్చి ఈ స్థలం మాది అని గొడవ చేస్తున్నారు. మంగళవారం మళ్లీ వచ్చి కాలేజీ గదులకు తాళాలు వేయడంతో పాటు టీవీ, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. డిడిపియు శ్రీనివాస్ మూర్తి వచ్చి పరిశీలించారు. విజయనగర పోలీసులు పిల్లలను బయటకు పంపి గొడవచేసిన వారిపై కేసు నమోదు చేశారు.