కి‘లేడీ’: బైక్‌పై వచ్చి.. కరోనా టీకా వేస్తున్నట్టు నటించి.. బంగారు గొలుసు మాయం..

Lady Chain Snatcher Vaccination Nallapadu Police Arrest Woman Gunturu - Sakshi

గుంటూరు రూరల్‌: ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి మాయమాటలు చెప్పి వారి వద్దనుంచి బంగారు గొలుసులు మాయంచేసే మాయలేడీని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. భవనం ప్రభావతి హౌసింగ్‌బోర్డ్‌ కాలనీ ఎల్‌ఐజీలో తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి నివాసం ఉంటుంది.

ఇద్దరే ఉంటున్నారని గమనించిన నగరంలోని గౌతమినగర్‌ 4వ లైనుకు చెందిన దొల చంద్రకళ ద్విచక్రవాహనంపై ప్రభావతి ఇంటికి ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం సమయంలో వచ్చింది. కరోనా టీకాలు వేస్తున్నామని మీరు టీకా వేయించుకోవాలని ప్రభావతిని నమ్మబలికింది. దీంతో ప్రభావతి సరే టీకా వేయండని చెప్పగా, టీకా వేస్తున్నట్లుగా నటిస్తూ మాయలేడీ చంద్రకళ ప్రభావతి మెడలోని రెండు బంగారు గొలుసులను కట్‌చేసి బయటకు పరిగెత్తింది.
(చదవండి: సాఫ్ట్‌వేర్‌ లవ్‌స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..)

ఒక్కసారిగా గొలుసు లాక్కుని పరారవ్వటంతో కిందపడిన ప్రభావతి తేరుకుని బయటకు వచ్చి చూడగా మాయలేడీ ద్విచక్ర వాహనంపై పరారవ్వటం గమనించింది. దీంతో చేసేదిలేక నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు అర్బన్‌ జిల్లా ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్‌ ఆదేశాల మేరకు సౌత్‌జోన్‌ రూరల్‌ డీఎస్పీ వై.జెస్సీప్రశాంతి, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ ఆరోగ్యరాజు సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా మాయలేడీ వినియోగిస్తున్న ద్విచక్రవాహనం నంబర్లు సైతం సరైనవి కాదని నంబర్లు మార్చి వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

ఎట్టకేలకు మాయలేడీ చంద్రకళను ఆదివారం అరెస్ట్‌ చేశారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితురాలు చేసిన నేరం ఒప్పుకుంది. చోరీ చేసిన రూ.4 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు రికవరీ చేశామని సీఐ తెలిపారు. దీంతోపాటుగా నిందితురాలు వినియోగిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్‌.ఆరోగ్యరాజును, ఎస్‌ఐ ఎస్‌.సత్యనాయక్, కానిస్టేబుళ్లు కె.సుబ్బారావు, షేక్‌ జాన్‌సైదా, షేక్‌ మస్తాన్‌వలి, ఎం.లోకేశ్వరరావులను అభినందించి అర్బన్‌ ఎస్పీ రివార్డులను ప్రకటించారని సీఐ తెలిపారు. 
(చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top