జగిత్యాలలో కలకలం: శవాన్ని బతికిస్తామని క్షుద్రపూజలు

Kshudra Pujas Done To Revive A Corpse In Jagtial - Sakshi

సగం చనిపోయాడు.. బతికిస్తాం!

శవం వద్ద క్షుద్రపూజలకు దంపతుల యత్నం.. 

అదుపులోకి తీసుకున్న పోలీసులు

అడ్డుకున్న మృతుడి కుటుంబసభ్యులు

కరీంనగర్‌ - జగిత్యాల ప్రధాన రహదారిపై ఆందోళన

జగిత్యాల క్రైం: ఓ వైపు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు ప్రజల్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిని బతికిస్తామంటూ దంపతులు ముందుకు రావడం.. మృతుని కుటుంబ సభ్యులు వారి మాటలు నమ్మడమే ఇందుకు నిదర్శనం. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్షుద్రపూజలు చేస్తే చనిపోయిన వ్యక్తి బతుకుతాడని, ఇందుకు పోలీసులు అడ్డుపడడం తగదని ఆగ్రహిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి మరీ నిరసన తెలపడం చర్చనీయాంశమైంది.

పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామానగర్‌కు చెందిన ఒర్సు రమేశ్, అనిత భార్యాభర్తలు. కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు. 15 రోజుల క్రితం వారు తమ ఇంటి సమీపంలోని కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర దంపతులతో గొడవపడ్డారు. అంతు చూస్తానంటూ రాజు ఆ సమయంలో రమేశ్‌ను బెదిరించాడు. కొద్దిరోజుల తర్వాత రమేశ్‌ ఇంట్లో దుర్గమ్మ పండుగ చేసుకున్నారు. మరుసటిరోజున రమేశ్‌ పిలవకుండానే అతని ఇంటికి పుల్లేశ్‌ భోజనం కోసం వెళ్లాడు. అప్పటికే భోజనం అయిపోగా.. కాసేపు ఆగితే వండిపెడతామని రమేశ్‌ చెప్పాడు. అయితే పుల్లేశ్‌ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు రమేశ్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్‌ మృతిచెందాడు.

చేతబడి చేశారని ఆరోపిస్తూ..  
కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర చేతబడి చేయడంతోనే రమేశ్‌ చనిపోయాడని మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు ఆ దంపతులను కట్టేసి కొట్టారు. దెబ్బలు భరించలేక తానే 
చేతబడి చేశానని.., సగం చంపానని, క్షుద్రపూజ చేసి బతికిస్తానని రాజు చెప్పాడు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు పూజాసామగ్రి తీసుకొచ్చారు. పూజ చేసేందుకు పుల్లేశ్‌ దంపతులు సిద్ధపడుతున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజు, సుభద్రలను అదుపులోకి తీసుకున్నారు. అయితే రమేశ్‌ సగం ప్రాణంతో ఉన్నాడని, అతని మృతదేహాన్ని తరలించవద్దని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించి పరీక్షించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు.. పుల్లేశ్‌ మంత్రం వేస్తే రమేశ్‌ బతికి వస్తాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కరీంనగర్‌–జగిత్యాల రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కానీ రాత్రి 7 గంటల వరకు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top