
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షానికి హబీబ్‌నగర్ అఫ్జల్ సాగర్ నాలా పొంగి ప్రవహించడంతో ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి మామా అల్లుళ్లు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ నాలాలో మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్ (26), రాము (25) అనే యువకులు కొట్టుకుపోయారు. నాటి నుంచి మృతదేహాల ఆచూకీ కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు గాలింపు చేపట్టాయి. ఐదు రోజుల తర్వాత వలిగొండ వద్ద అర్జున్ మృతదేహం లభ్యమైంది. ఎనబై ఐదు కిలోమీటర్లు వరదనీటిలో మృతదేహం కొట్టుకుపోయింది. రాము మృతదేహం ఇంకా లభించలేదు.
కాగా, అర్జున్, రాము ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు అఫ్జల్‌సాగర్ నాలా ప్రక్కనే ఉండటంతో ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. ఇంట్లోని సామాన్లు బయటకు తెచ్చే క్రమంలో రాము అదుపు తప్పి నాలాలో పడ్డాడు. అతడిని కాపాడే క్రమంలో అర్జున్ కూడా నాలాలో పడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. కాగా, నగరం మరోసారి తడిసిముద్దయింది. బుధవారం రాత్రి కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో నగర జన జీవనం అతలాకుతలమైంది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా వర్ష ఉద్ధృతితో నగర వాసులు బెంబేలెత్తిపోయారు.

వర్షం దాటికి నిమిషాల వ్యవధిలోనే రోడన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు అపార్ట్‌మెంట్లతోపాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరగా, డైనేజీ, ఓపెన్ నాలాలు పొంగిపొర్లాయి. మెట్రో స్టేషన్లు, బ్రిడ్జిల కింద భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి.
భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్ది ట్రాిఫిక్ జామ్ అయింది. మాదాపూర్–హైటెక్ సిటీ చౌరస్తా, రాయదుర్గం, అమీర్‌పేట బంజారాహిల్స్ ఐకియా మార్గంలో, మియాపూర్– చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై వాహనాలు ముందుకు కదల్లేదు. దీంతో ముంబై జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 12 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్ తాళ్లబస్తీలో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం.