
అభిమానులతో నిండిపోయిన గౌహతి స్టేడియం
గౌహతి: ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ కడసారి చూపు కోసం ఆదివారం అసోంలోని గౌహతికి లక్ష మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. గౌహతిలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కిక్కిరిసిపోయింది. ఉదయానికే అక్కడికి చేరుకున్న జనం ఎండ తీవ్రతను, ఆ తర్వాత వచ్చిన భారీ వర్షాన్ని సైతం జనం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారు. అభిమానులు జుబీన్ చిత్రాలున్న కటౌట్లను చేబూని, ఆయనకిష్టమైన పాటలు పాడారు. జుబీన్ గార్గ్ శుక్రవారం సింగపూర్‌లోని సముద్రంలో ఈదుతూ చనిపోవడం తెల్సిందే.
సింగపూర్ నుంచి జుబీన్ మృతదేహాన్ని విమానంలో శనివారం అర్ధరాత్రి ఢిల్లీకి తీసుకువచ్చారు. మరో విమానంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి గౌహతికి మృతదేహం చేరుకుంది. గౌహతి విమానాశ్రయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని కహిలీపారలో ఉన్న జుబీన్ నివాసం వరకు దారి పొడవునా వేలాది మంది ఆఖరిసారిగా చూసుకునేందుకు రహదారిపైకి చేరారు. దీంతో ఆరు గంటల సమయం పట్టింది.
మృతదేహం స్టేడియంకు చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలయింది. అప్పటికే అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వేదికపై గాజు శవ పేటికలో ఉంచిన జుబీన్ మృతదేహాన్ని కడసారి చూసుకునేందుకు జనం క్యూ కట్టారు. రాత్రయినా అభిమానుల తాకిడి కొనసాగుతోంది. దీంతో, అభిమానుల సందర్శనార్ధం మృతదేహాన్ని రాత్రంతా అక్కడే ఉంచుతామని, ఉదయం కూడా అక్కడే ఉంటుందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తన భర్త కోసం తరలివచి్చన అసంఖ్యాక అభిమానులకు జుబీన్ భార్య, ప్రముఖ డిజైనర్ గరిమ కృతజ్ఞతలు తెలిపారు.