ఉరితాడు కోసి.. ఊపిరి పోసి 

Jubileehills Police Rescued Woman Who Commits Suicide - Sakshi

మహిళ ఆత్మహత్యాయత్నం

పోలీసుల సమయస్ఫూర్తి  

వివాహితకు ప్రాణదానం  

బంజారాహిల్స్‌: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సకాలంలో స్పందించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమెను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఘటన జరుగుతున్న సమయంలో జూబ్లీహిల్స్‌ పోలీసుల సమయస్ఫూర్తి ఆ మహిళను కాపాడగలిగింది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–5లోని దుర్గాభవానీనగర్‌ బస్తీలో నివసించే రమావత్‌ సిరి (45) అనే మహిళ శనివారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటికి వచ్చి ఓ ఖాళీ ప్లాటులోని చెట్టుకు ఉరేసుకుంటుండగా పక్క ప్లాటులో ఉన్న విశ్వనాథ్‌రెడ్డి అనే అడ్వకేట్‌ గమనించారు. వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్‌డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ శేఖర్‌ వెంటనే గస్తీ పోలీసులను అక్కడికి వెళ్లాల్సిందిగా పురమాయించారు.

అదే సమయంలో విశ్వనాథరెడ్డిని రిక్వెస్ట్‌ చేసి వెంటనే అక్కడికి వెళ్లి చెట్టుకు కట్టిన తాడును తెంపేయాల్సిందిగా సూచించారు. 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. హుటాహుటిన ఎస్‌ఐ కూడా అక్కడికి బయల్దేరారు. అయిదు నిమిషాల వ్యవధిలోనే బ్లూకోట్స్‌ పోలీసులు సందీప్, బాలపెద్దన్న, అడ్వకేట్‌ విశ్వనాథరెడ్డి అక్కడికి వెళ్లారు. చెట్టుకు వేలాడుతున్న మహిళను కిందకు దించేందుకు తాడును కోసేశారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆమె కొట్టుమిట్టాడుతుండగా అంబులెన్స్‌ సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి ఆక్సిజన్‌ అందించి ఊపిరిపోశారు. ఆమె గంట సేపట్లోనే తేరుకుంది. పోలీసులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఆ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని పోలీసులను స్థానికులు ప్రశంసించారు. ఎస్‌ఐ శేఖర్‌కు అధికారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top