పెళ్లి చేసుకుంటానంటూ పరిచయం.. చివరికి

Hyderabad: Money Cheating In The Name Of Marriage  - Sakshi

వివాహ వేదిక పరిచయాలతో బ్యాంకు అకౌంట్లు ఖాళీ 

మోసపోతున్న యువతీయువకులు 

రాజేంద్రనగర్‌ పీఎస్‌లో రెండు కేసులు నమోదు  

రాజేంద్రనగర్‌: వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్న ఓ యువతికి.. రష్యా నుంచి ఓ యువకుడు ఫోన్‌ చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ రెండు లక్షల రూపాయలను బ్యాంక్‌ ఖాతాలో వేయించుకోని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. దీంతో ఆ యువతి రాజేంద్రనగర్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. కిస్మత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన 24 సంవత్సరాల యువతి ప్రైవేట్‌ ఉద్యోగి. వివాహం చేసుకునేందుకు వివాహ పరిచయ వేదికలో తన పేరు, ఫోన్‌ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసుకుంది. అయితే తాను రష్యాలో ఉంటానని చెబుతూ గత వారం ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన వివరాలు తెలుపుతూ మాటలు కలిపాడు. ఫోన్‌లో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి వివాహం చేసుకునేందుకు అంగీకరించారు.

ఆ యువకుడు గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ తెలిపి ఇంటి చిరునామా, తదితర వివరాలు తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మాట్లాడుతున్నామంటూ గిఫ్ట్‌ ప్యాక్‌ వచ్చిందని, పన్ను రూపేనా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పాడు. దీంతో ఆ యువతి రష్యా యువకుడికి ఫోన్‌ చేసి తెలపడంతో ఖరీదైన గిఫ్ట్‌ అని పన్ను కట్టి తీసుకోవాలంటూ సూచించాడు. అంత డబ్బు తన వద్ద లేవని తెలపడంతో మూడు దఫాలుగా కట్టమని సూచించాడు. సదరు యువతి ఆరు రోజుల క్రితం మూడు దఫాలుగా రెండు లక్షల రూపాయలను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫోన్‌ చేస్తున్నామని తెలిపిన వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేసింది. మూడు రోజుల అనంతరం గిఫ్ట్‌ వస్తుందని తెలిపారు. మూడు రోజులుగా డబ్బు తీసుకున్న వ్యక్తి, వివాహం చేసుకుంటానని తెలిపిన ఇద్దరు వ్యక్తులు సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ రావడంతో లబోదిబోమంటూ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
మరో కేసులో ఇలా.. 
వివాహ పరిచయ ద్వారా యువకుడి ఫోన్‌ నంబర్‌ తీసుకుని ఓ యువతి 48 వేల రూపాయలను బ్యాంక్‌ అకౌంట్‌లో వేయించుకోని స్విచ్‌ఆఫ్‌ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సులేమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన యువకుడు తన పెళ్లి కోసం వివాహ పరిచయ వేదికలో పేరు నమోదు చేసుకున్నాడు. అతడి ఫోన్‌ నంబర్‌కు ఖతార్‌ దేశానికి చెందిన యువతి ఫోన్‌ చేసి తాను వివాహం చేసుకుంటానంటూ తన వివరాలతో పాటు అతడి వివరాలు సేకరించింది.
గత వారం ఫోన్‌లో అన్ని వివరాలు మాట్లాడుకున్న అనంతరం ఆ యువతి హైదరాబాద్‌ వస్తున్నానని తెలిపింది. సోమవారం ఉదయం తాను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగానని తన వద్ద ఉన్న లగేజీ, ఇతర విలువైన సామాన్లకు రూ.48 వేల ఇండియన్‌ కరెన్సీ కట్టమంటున్నారని తెలిపింది. తన వద్ద ఖతార్‌ కరెన్సీ ఉందని ఈ నగదు చెల్లదంటున్నారని తెలపడంతో.. సదరు యువకుడు గూగుల్‌ పే ద్వారా రూ.48 వేలు పంపించాడు. ఆ తర్వాత యువతి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకుంది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన యువకుడు గురువారం రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

( చదవండి: ప్రేమ పెళ్లికి నిరాకరించారని ఇంటి నుంచి పరార్‌ )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top