ఎస్కార్ట్‌ సర్వీస్‌ పేరుతో నీచాలు.. అశ్లీల వ్యాఖ్యలతో ఫోటోలు ఆప్‌లోడ్‌ చేస్తూ..

Hyderabad: Harassing Women In The Name Of Escort Service, Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టించి మహిళల సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపడం.. వారి వ్యక్తిగత ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిని ఎస్కార్ట్‌ సర్వీస్‌ పేరుతో ప్రొఫెషనల్స్‌గా పేర్కొంటూ అశ్లీల వ్యాఖ్యలు జోడించడం...  ఇలా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌లు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశంజిల్లా కంభం మండలానికి చెందిన గంగుల హరీష్‌(19) 2022 ఏప్రిల్‌లో యూట్యూబ్‌లో ఒక ఛానల్‌ను క్రియేట్‌ చేశాడు.  నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టించి, మహిళల ఫొటోలను సోషల్‌ మీడియా నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేవాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో మహిళలను ఎస్కార్ట్‌ సర్వీస్‌ ప్రొఫెషనల్స్‌గా పేర్కొంటూ, అశ్లీల వ్యాఖ్యలతో ఆ ఫొటోలను ఆప్‌లోడ్‌ చేస్తున్నాడు.

దీంతో అతని ఛానల్‌ను 20 వేల మంది సబ్‌ స్రైబ్‌ చేయడంతో పాటు అతను అప్‌లోడ్‌ చేసిన వీడియోలను చాలా మంది వీక్షించారు. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు అతడిని హెచ్చరిస్తూ కాల్స్‌ చేయడంతో వాటిని యూట్యూట్‌ నుంచి తొలగించాడు.  అనంతరం బాధితులు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు గంగుల హరీష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్, రెండు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.  

   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top