ప్రాణం తీసిన వివాహేతర సంబంధం 

HYD: Man Killed Over Extramarital Affair In Falaknuma - Sakshi

సాక్షి, చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమాలో ఇటీవల జరిగిన యువకుడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.దేవేందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఫలక్‌నుమా అచ్చిరెడ్డినగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ పర్వేజ్‌(23) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా అదే మహిళతో గుల్జార్‌నగర్‌కు చెందిన షేక్‌ అబ్బాస్‌(25)కు కూడా ఏడాదిన్నరగా సంబంధం ఉంది.

ఈ విషయం తెలియడంతో పర్వేజ్‌ అబ్బాస్‌తో మాట్లాడవద్దని సదరు మహిళను మందలించాడు. అంతేగాక అబ్బాస్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్న అతను నవాబ్‌సాహెబ్‌కుంటకు చెందిన తన స్నేహితుడు షేక్‌ అక్రం(24)తో కలిసి పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 1న రాత్రి అబ్బాస్‌కు ఫోన్‌ చేసి బయటికి పిలిచాడు. కొద్ది దూరం వెళ్లగానే అక్రం అతడిని పట్టుకోగా పర్వేజ్‌ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అబ్బాస్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఖదీర్‌బీ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top