తిండి లేక కొడుకు ఇంటి ముందే ప్రాణాలు విడిచిన తల్లి | Human relations lost even before Amma | Sakshi
Sakshi News home page

తిండి లేక కొడుకు ఇంటి ముందే ప్రాణాలు విడిచిన తల్లి

Aug 23 2024 4:51 AM | Updated on Aug 23 2024 4:51 AM

Human relations lost even before Amma

కోడలే  దహన సంస్కారాలు చేసిన వైనం

అమ్రాబాద్‌: అమ్మ ముందు కూడా మానవ సంబంధాలు ఓడిపోయాయి. అమ్మ నుంచి వచ్చిన ఆస్తులు పంచుకున్న ఇద్దరు కొడుకులూ అమ్మను మాత్రం ఆదరించలేకపోయారు. దీంతో ఆ తల్లి తిండిలేక చిన్న కొడుకు ఇంటిముందే కన్నుమూసింది. కోడలే కొడుకై అంత్యక్రియలు నిర్వహించిన ఘటన గ్రామస్తులను కలచివేసింది. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని తిర్మలాపూర్‌(బీకే)లో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తిర్మలాపూర్‌(బీకే) గ్రామానికి చెందిన మిద్దె అంబమ్మ(75)కు ముగ్గురు కుమారులు తిరుపతయ్య, పోషప్ప, మల్లేశ్, ఒక కూతురు సంతానం. 

అంబమ్మకు ఆరెకరాల వ్యవసాయ పొలం, ఇల్లు ఉండగా.. ముగ్గురు అన్నదమ్ములు సమానంగా పంచుకున్నారు. అంబమ్మ భర్త, పెద్ద కొడుకు గతంలోనే మృతి చెందారు. అయితే తిరుపతయ్య మృతితో పెద్ద కోడలు వెంకటమ్మ తన పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడే పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కొన్నాళ్ల పాటు అత్తఅంబమ్మను హైదరాబాద్‌ తీసుకెళ్లి పోషించింది. 

3 రోజుల క్రితం చిన్న కొడుకు దగ్గరికి..: మూడు రోజుల క్రితం అంబమ్మను స్వగ్రామానికి తీసుకువచ్చి మరిది మల్లేశ్‌ ఇంటి వద్ద దించి వెంకటమ్మ వెళ్లిపోయింది. కొడుకులిద్దరూ అంబమ్మను పట్టించుకోకపోవడంతో తిండిలేక గురువారం ఉదయం మృతి చెందింది. తల్లి చనిపోయినా ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు కొడుకులిద్దరూ ముఖం చాటేయడంతో గ్రామస్తులే వెంకటమ్మతో తలకొరివి పెట్టించారు. 

Advertisement
 
Advertisement
Advertisement