కాల్‌గర్ల్స్‌ను సరఫరా చేస్తామని, అశ్లీల వీడియో కాల్స్‌ చేయిస్తామని ఎర

Hitech Gang Arrest In Kurnool For Doing Fraud Business - Sakshi

కర్నూలు: కాల్‌గర్ల్స్, అశ్లీల స్త్రీల వీడియో కాల్స్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను వన్‌టౌన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. వివరాలను సీఐ కళా వెంకటరమణ మీడియాకు వివరించారు. కర్నూలు మండలం మిలటరీ కాలనీకి చెందిన తెలుగు జనార్ధన్, అలాగే శ్రీరామనగర్‌కు చెందిన బెస్త ప్రవీణ్‌కుమార్‌ కొంతకాలంగా సాధారణ ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కాల్‌గర్ల్స్‌ను సరఫరా చేస్తామని, అశ్లీల వీడియో కాల్స్‌ చేయిస్తామని రూ. 300 నుంచి రూ. 5,000 వరకు ఖర్చు అవుతుందని ఎర వేస్తారు.

ఒకేసారి వాట్సప్‌లో యాప్స్‌ను ఉపయోగించి 100 నుంచి 1000 మంది వరకు బల్క్‌ మెసేజ్‌లు పంపుతారు. ఎవరైనా ఆకర్షితులైతే వారిని మభ్యపెట్టి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పటికే ఎంతోమంది వీరికి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసి మోసపోయినట్లు ఇటీవల కాలంలో బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దృష్టి సారించిన వన్‌టౌన్‌ సీఐ దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో జొహరాపురం సబ్‌ స్టేషన్‌ వద్ద నిందితుడు తెలుగు జనార్ధ్దన్‌ ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు.

మరో నిందితుడి వివరాలు చెప్పడంతో మాంటిస్సోరి స్కూల్‌ వద్ద ప్రవీణ్‌కుమార్‌తో పాటు నిందితులు వాడిన సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి బ్యాంక్‌ అకౌంట్లను ఇప్పటికే గుర్తించామన్నారు. రోజూ రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. యువత ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top