ఐసీయూలో ఐస్‌క్రీం తిని అత్త.. హోటల్‌ రూంలో మేనల్లుడు మృతి | Sakshi
Sakshi News home page

ఐసీయూలో ఐస్‌క్రీం తిని అత్త.. హోటల్‌ రూంలో మేనల్లుడు మృతి 

Published Mon, Jul 5 2021 5:53 PM

Gurugram Woman Dies After Eating Ice Cream ICU Nephew Found Dead in Hotel - Sakshi

గురుగ్రామ్‌: తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ ఎయిర్‌హోస్టెస్‌ ఐసీయూలో ఐస్‌ క్రీం తిని మృతి చెందగా.. మరుసటి రోజే ఆమె మేనల్లుడు హోటల్‌ రూంలో విగతజీవిగా కనిపించాడు. వీరిద్దరి మృతి పట్ల సోషల్‌ మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతుండటంతో మేఘాలయా తురా పార్లమెంట్‌ సభ్యుడు అగాథ సంగ్మా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వం శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ, గురుగ్రామ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. 

నాగాలాండ్‌కు చెందిన రోసి సంగ్మా (29) ఎయిర్‌ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మేనల్లుడి సామువేల్‌ సంగ్మాతో కలిసి హరియాణ గురుగ్రామ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 23న రోసి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. కాళ్లు,చేతుల్లో విపరీతమైన నొప్పి, తీవ్ర రక్తస్రావంతో బాధపడింది. దాంతో సామువేల్‌, రోసిని ఢిల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చించాడు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరుసటి రోజు ఉదయం అనగా జూన్‌ 24 ఉదయం, రోసిని గురుగ్రామ్‌ సెక్టార్‌ 10లోని ఆల్ఫా హాస్పిటల్‌కు తరలించారు. 

ఆల్ఫా ఆస్పత్రి ఐసీయూలో చేర్చిన తర్వాత రోసి కోలుకుందని తెలిపాడు సామువేల్‌. తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇబ్బంది పడిన రోసి ఆ తర్వాత ఆల్ఫా హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్నప్పుడు ఐస్‌క్రీం తిన్నదని తెలిపాడు. ఆ సమయంలో రోసి ఎదురుగా డాక్టర్లు ఉన్నారని.. కానీ ఆమెను వారించలేదని ఆరోపించాడు. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడయి.. మరణించిందని తెలిపాడు సామువేల్‌. దీని గురించి ప్రశ్నించిన తనను ఆల్ఫా ఆస్పత్రి సిబ్బంది కిందపడేసి చితకబాదారన్నాడు.

రోసి చనిపోయిన విధానం తెలియజేస్తూ సామువేల్‌ వీడియో రూపొందించి, న్యాయం చేయాల్సిందిగా కోరుతూ.. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ మరుసటి రోజే ఓ హోటల్‌ రూంలో సామువేల్‌ మృతదేహం వెలుగు చూడటం కలకలం రేపింది. సామువేల్‌, రోసిల మృతిపై సోషల్‌ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు నెటిజనులు. సామువేల్‌ మృతి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకుని సామువేల్‌ చనిపోయినట్లు తెలిపారు. 

ఈ క్రమంలో ఆల్ఫా హాస్పిటల్‌ యాజమాన్యం ఈ సంఘటనపై స్పందించింది. తమ ఆస్పత్రికి వచ్చాక రోసి ఆరోగ్యం మెరుగైందని.. ఈ క్రమంలో ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్‌ ఐస్‌క్రీం తినడం చూసిన రోసి.. తనకు కూడా కావాలని అడిగిందని తెలిపారు. రోసి తన ఇష్టప్రకారమే ఐస్‌ క్రీం తిన్నదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఇక సామువేల్‌పై తాము దాడి చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై సామువేల్‌ ​తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చనిపోయేంత పిరికివాడు కాదు. రోసికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. చనిపోయే రోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నాకు కాల్‌ చేసి మాట్లాడాడు. మరికాసేటికే చనిపోయాడని తెలిసింది. తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది’’ అన్నాడు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement