గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలుశిక్ష 

Gandhis Great Grandaughter Sentenced To 7 years Jail In South Africa - Sakshi

మోసం కేసులో దక్షిణాఫ్రికా కోర్టు తీర్పు

జోహన్నస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ మునిమనవరాలికి స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మహాత్మాగాంధీ ముని మనవరాలైన ఆశిశ్‌ లత రామ్‌గోబిన్‌ 62 లక్షల ర్యాండ్‌ (దాదాపు 3.32 కోట్ల రూపాయల)ల మేరకు స్థానిక వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహారాజ్‌ను మోసం చేయడంతో పాటు, ఫోర్జరీకి పాల్పడినట్లు రుజువు కావడంతో డర్బన్‌లోని ఒక కోర్టు సోమవారం ఆమెకు ఈ శిక్ష విధించింది. భారత్‌ నుంచి ఒక కల్పిత కన్‌సైన్‌మెంట్‌ను సృష్టించి, దానికి ఇంపోర్ట్‌ అండ్‌ కస్టమ్స్‌ పన్ను చెల్లించాలని చెప్పి ఎస్‌ఆర్‌ మహారాజ్‌ నుంచి ఆమె మోసపూరితంగా 62 లక్షల ర్యాండ్‌లు తీసుకున్నారన్న ప్రధాన ఆరోపణపై ఈ జైలుశిక్ష విధించారు. సంబంధిత లావాదేవీలో లభించిన లాభంలో వాటా ఇస్తానని కూడా ఆమె హామీ ఇచ్చారని మహారాజ్‌ ఆరోపించారు.

దక్షిణాఫ్రికాలో ప్రముఖ హక్కుల కార్యకర్త అయిన ఈలా గాంధీకి లత రామ్‌గోబిన్‌ కూతురు. మూడు కంటెయినర్ల లినెన్‌ వస్త్రం భారత్‌ నుంచి వస్తోందని పెట్టుబడిదారులను నమ్మిం చేందుకు ఆమె ఇన్‌వాయిస్‌లను, ఇతర డాక్యుమెంట్లను సృష్టించారని నేషనల్‌ ప్రాసిక్యూటింగ్‌ అథారిటీ కోర్టుకు తెలిపింది. ప్రాసిక్యూషన్‌ వాదనల ప్రకారం.. 2015 ఆగస్ట్‌లో న్యూ ఆఫ్రికా అలయన్స్‌ ఫుట్‌వేర్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌ మహారాజ్‌ను లత రామ్‌గోబిన్‌ కలిశారు. ఆ సంస్థ వస్త్ర వ్యాపారంలోనూ ఉంది. నెట్‌కేర్‌ అనే హాస్పిటల్‌ గ్రూప్‌ కోసం భారత్‌ నుంచి మూడు కంటెయినర్లలో లినెన్‌ వస్త్రం దిగుమతి చేసుకున్నానని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటి ఇంపోర్ట్‌ అండ్‌ కస్టమ్స్‌ పన్ను చెల్లించలేకపోతున్నానని, 62 లక్షల ర్యాండ్‌లు సర్దుబాటు చేస్తే నౌకాశ్రయం నుంచి ఆ కంటెయినర్లు బయటకు వస్తాయని ఆమె ఆయనకు వివరించారు.

ఆ తరువాత, ఆ డబ్బు చెల్లించడంతో పాటు లాభంలో వాటా ఇస్తానని ఆయనకు హామీ ఇచ్చారు. ఆయనను నమ్మించడం కోసం నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఇతర డాక్యుమెంట్లను చూపించారు. లత రామ్‌గోబిన్‌ కుటుంబానికి ఉన్న విశ్వసనీయత దృష్ట్యా ఆర్‌ఎస్‌ మహారాజ్‌ ఆ డబ్బు చెల్లించి, లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్నారు. అనంతరం, జరిగిన మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ కుటుంబానికి చెందిన పలువురు దక్షిణాఫ్రికాలో సామాజిక కార్యకర్తలుగా, పౌరహక్కుల కోసం పోరాడుతున్నారు. మానవ హక్కుల కార్యకర్తగా లత రామ్‌గోబిన్‌ తల్లి ఈలా గాంధీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ఆమెను భారత్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాలు అవార్డులతో సత్కరించాయి.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top