ఫేక్‌ ఐడీలతో మోసం.. 

Fraud With Fake IDs In Facebook - Sakshi

డబ్బు అవసరమంటూ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో పోస్టింగ్‌లు

పోస్టింగ్‌ చూసిన వెంటనే స్పందిస్తున్న స్నేహితులు

వేరే రాష్ట్రాల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమైనట్లు గుర్తింపు 

బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): ఆధునిక యుగంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌లు ఓపెన్‌ చేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు యువత ఇంటర్నెట్‌ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాను విరివిరిగా వినియోగిస్తున్నారు. ఎటువంటి సమాచారమైనా క్షణాల్లో పోస్టింగ్‌ చేయడం.. షేర్‌ చేయడం అలవాటుగా మారింది. దీంతో ఉపయోగం ఎంత ఉందోకానీ కొందరికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ప్రొఫైల్‌ ఫొటోను కొందరు డౌన్‌లోడ్‌ చేసుకుని ఫేక్‌ అకౌంట్‌ను అదే పేరుమీద ఓపెన్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఓన్‌ హెల్ప్‌ మీ..అంటూ చాటింగ్‌ చేస్తారు. చదవండి: ఫోన్‌ చేసి విసిగిస్తావా అంటూ..

ఫేస్‌బుక్‌ స్నేహితులు స్పందించినప్పుడు అర్జెంట్‌గా అమౌంట్‌ కావాలని, గూగూల్‌ పే, ఫోన్‌ పే, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌.. ఇలా ఏదీ కావాలంటే అది ఇస్తారు. ఆపదలో ఉన్నారు.. అత్యవసరంగా డబ్బు అవసరమై ఉంటుందని భావించిన స్నేహితులు రూ.20 వేలు, రూ.10 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. మొదట్లో పెద్ద మొత్తంలో మనీ అవసరమంటూ చాటింగ్‌ చేస్తూ చివరకు ఎంతో కొంత అత్యవసరంగా కావాలంటూ అడుగుతున్నారు. చదవండి: వీడని మిస్టరీ: ఆ బాలుడు ఏమయ్యాడో..?

గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ ఎస్‌ఐ, కంభంలోని హీరో షోరూమ్‌ వ్యక్తి, బేస్తవారిపేటలోని ఓ కళాశాల కరస్పాండెంట్‌ల పేరుతో దొంగ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లు సృష్టించి పలువురి నుంచి భారీగానే అమౌంట్‌ దోచేశారు. వారం క్రితం ఓ పురుగుమందుల సంస్థలో పనిచేసే సేల్స్‌ మేనేజర్‌ అకౌంట్‌ను ఇలాగే చేశారు. స్పందించిన ఐదుగురు స్నేహితుల నుంచి రూ.60 వేలు కొట్టేశారు. ఇచ్చిన బ్యాంక్‌ అంకౌంట్‌ నంబర్‌లు, ఫోన్‌ నెంబర్‌లు ఛత్తీఘడ్‌లోని రాయచూర్‌ ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. 

గూగూల్, ఫోన్‌ పేలలో ఒకే పేరు  
గూగూల్‌ పే, ఫోన్‌ పేలలో ఫోన్‌ నంబర్‌ నమోదు చేయగానే పేరు చూపిస్తుంది. దొంగతనంగా తయారు చేసిన డూప్లికేట్‌ వ్యక్తుల ఫోన్‌ నంబర్‌ ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు సంబంధించినా ఓరిజినల్‌ వ్యక్తికి సంబంధించిన పేరు వస్తుంది. దీంతో నగదు బదిలీ చేసేటప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా స్నేహితులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రాన్సక్షన్స్‌ ముగిసిన తర్వాత మరుసటి రోజుకు అతని ఫోన్‌ నంబర్‌ ఫోన్‌ పేలో నమోదు చేస్తే వేరే పేరు రావడం గమనార్హం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top