Kurnool: మామ, మరుదులకు అవమానం.. భర్త లేని సమయంలో పెద్ద కోడలిని..

Four Men Assassinated Daughter In Law In Kurnool District - Sakshi

అవమానించిందని అంతమొందించారు! 

ఇంటి పెద్ద కోడలిని చంపేసిన మామ, మరుదులు

నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

హాలహర్వి(కర్నూలు జిల్లా): పలు మార్లు తమను అవమానించి కుటుంబ పరువు తీసిందని ఇంటి పెద్ద కోడలిని కుటుంబీకులే అంతమొందించారు. చింతకుంట గ్రామంలో గత నెల 15వ తేదీన జరిగిన మహిళ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య, హాలహర్వి ఎస్‌ఐ వెంకట సురేష్‌ సోమవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన ఎర్రిస్వామికి నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు వన్నప్పకు పదేళ్ల క్రితం అర్ధగేరి గ్రామానికి చెందిన సువర్ణమ్మ(30)తో వివాహమైంది. వీరికి సంతానం కాలేదు. కుటుంబ కలహాలతో సువర్ణమ్మ పలు మార్లు మామ ఎర్రిస్వామి, మరిది సుంకన్నతో ఘర్షణ పడి చెప్పుతో కొట్టడం, వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

(చదవండి: ఏమైందో ఏమో.. బయటకెళ్లిన ఇద్దరు యువతులు తిరిగి రాలేదు..)

దీంతో కుటుంబ పరువు తీసిందని భావించి సువర్ణమ్మను మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. అక్టోబర్‌ 15వ తేదీన దసరా పండుగ రోజు వన్నప్ప బన్ని ఉత్సవానికి దేవరగట్టుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మామ ఎర్రిస్వామి, మరుదులు సుంకన్న, బ్రహ్మయ్య, హనమంతు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సువర్ణను గొడ్డలితో నరికి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కర్ణాటకలోని మోకా వద్ద వీరాపురం రైల్వే ట్రాక్‌పై పడేశారు.

(చదవండి: రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం)

మరుసటి రోజు సువర్ణమ్మ కనిపించడం లేదని భర్త వన్నప్ప, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తుండగా మూడు రోజుల తర్వాత రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం వెలుగులోకి రావడంతో హత్య చేసి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. వన్నప్ప కూడా తన తండ్రి, తమ్ముళ్లపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. నిందితులను మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరుచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.       

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top