గుట్కా స్కాం కేసులో మాజీ మంత్రి పేరు?

Former Minister BV Ramana Name In Gutkha Scam Case - Sakshi

సాక్షి, చెన్నై: గుట్కా స్కాం కేసులో ఈడీ తన చార్జ్‌షీట్‌ను చెన్నై సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి బీవీ రమణతో పాటు పలువురి పేర్లు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. గుట్కా విక్రయాలకు లంచం వ్యవహారం గతంలో పోలీసు శాఖలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో లభించిన ఓ డైరీ గుట్కా గుట్టు ను వెలుగులోకి తెచ్చింది. సీబీసీఐడీ విచారించినా, కేసు అడుగైనా ముందుకు సాగని దృష్ట్యా, చివరకు సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ రంగంలోకి దిగి దిగగానే, దాడులు హోరెత్తాయి. అప్పటి డీజీపీ, మాజీ కమిషనర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఆరోగ్యమంత్రి అంటూ లిస్టు చాంతాడు అంతగా మారింది. మాజీ మంత్రి బీవీ రమణ, ప్రస్తుతం ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌ల వద్ద విచారణ సాగించిన సీబీఐ, పోలీసు బాసులపై ఆచితూచి స్పందించే రీతిలో అడుగులు వేసింది. తొలుత సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈ సమయంలో విచారణకు కరోనా అడ్డుగా మారింది. ఓ వైపు సీబీఐ మళ్లీ ఫైల్‌ దుమ్ము దులిపిన నేపథ్యంలో ఈడీ తన చార్జ్‌ïÙట్‌ను మంగళవారం సాయంత్రం చెన్నై జిల్లా సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసి ఉండడం గమనార్హం. 

ఎన్నికల వేళ చార్జ్‌షీట్‌ కలవరం... 
గుట్కా స్కాంలో ఈడీ విచారణ చార్జ్‌షీట్‌ అన్నాడీఎంకేను కలవరంలో పడేసింది. ఎన్నికల వేళ ఈ వ్యవహారాన్ని ప్రతి పక్షాలు అస్త్రంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ చార్జ్‌లో 2013 –2016 మధ్య రూ.639 కోట్ల మేరకు అక్రమ గుట్కా వ్యవహారాలు సాగినట్టు తేల్చారు. అలాగే, చార్జ్‌షీట్‌లో మాజీ మంత్రి రమణ పేరు చేర్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి సహాయకుల పేర్లు సైతం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ కేసులో గుట్కా విక్రయదారులు మాధవరావు, శ్రీనివాసరావు, ఉమాశంకర్‌ గుప్తాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడుల్లోని ఆస్తుల వివరాలు, రూ. 246 కోట్ల మేరకు చేసిన ఆస్తుల అటాచ్‌ వివరాలను చార్జ్‌ షీట్‌లో పొందు పరిచారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top