విశాఖలో డ్రగ్స్‌ అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్‌  | Sakshi
Sakshi News home page

విశాఖలో డ్రగ్స్‌ అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్‌ 

Published Mon, Aug 8 2022 4:25 AM

Five people were arrested for selling drugs in Visakhapatnam - Sakshi

అల్లిపురం (విశాఖ దక్షిణం): స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గోవా నుంచి (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైథైల్‌ అమైడ్‌) ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ నగరానికి తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు, యాంటీ నార్కోటిక్‌ సెల్, సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ విలేకరులతో మాట్లాడారు.

నగరానికి చెందిన పాంగి రవికుమార్‌ అనే వ్యక్తి గంజాయి తీసుకుని వెళ్లి గోవాలో దిలీప్‌ అనే వ్యక్తికి ఇచ్చి, అతని వద్ద నుంచి నార్కోటిక్‌ డ్రగ్స్‌ తీసుకువచ్చి నగరంలో అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ గ్రూపుల ద్వారా డార్క్‌ వెబ్‌సైట్‌ ఉపయోగించుకుని క్రిప్టోకరెన్సీ, యూపీఐ పేమెంట్స్‌ చేస్తూ పోస్టల్, ప్రైవేట్‌ కొరియర్స్‌ ద్వారా డ్రగ్స్‌ రవాణా జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారం అంతా ఆన్‌లైన్‌లో జరుగుతోందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి డ్రగ్స్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.   

 
Advertisement
 
Advertisement