కూలీ బతుకులు ఛిద్రం

Five People Deceased In Road Accident - Sakshi

వ్యానును ఢీకొట్టిన పాలవ్యాను

ఐదుగురు కూలీల దుర్మరణం

నెల్లూరు జిల్లాలో విషాదం

సంగం: తెల్లవారకముందే కూలి పని కోసం బయలుదేరిన వారిని పాల వ్యాన్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. పనుల కోసం వ్యాన్‌లో బయలుదేరిన వారు.. రక్తపుమడుగులో రోడ్డుపైనే విగతజీవులయ్యారు. రక్తసిక్తమైన రోడ్డు, చెల్లాచెదురుగా పడిన వారితో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఈ దుర్ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఉదయం 5 గంటల సమయంలో కూలీలు ఉన్న వ్యాన్‌ను పాల వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. పెద్దశబ్దం రావడంతో చుట్టపక్కలవారు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. అప్పటికే నలుగురు కూలీలు విగతజీవులయ్యారు. కొందరు రక్తమోడుతున్న గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కన్నుమూశాడు.

ఏడుగురు గాయాలతో చికిత్స పొందుతున్నారు.  వివరాలు.. దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన 18 మంది, మక్తాపురానికి చెందిన నలుగురు కూలీలు విడవలూరు మండలంలో చేపలు పట్టేందుకు వెళ్లాల్సి ఉంది. మక్తాపురానికి చెందిన నలుగురు ముందే వ్యానులో ఎక్కారు. దువ్వూరుకు చెందిన వారు వచ్చి వ్యాను ఎక్కుతుండగా.. వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నుంచి నెల్లూరు వెళుతున్న పాల వ్యాను వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో దువ్వూరుకు చెందిన గాలి శీనయ్య (55), కోటపూరి మాలకొండయ్య (61), తువ్వర రమణయ్య (57), కంచర్ల బాబు (60).. అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మోచర్ల శీనయ్యను నెల్లూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలొదిలాడు. వ్యాను డ్రైవర్‌ విక్రం నాగరాజ్, ఆటో ఎక్కుతున్న గంగపట్నం శ్రీనివాసులు, గడ్డం నందా, వెంకయ్య, కె వెంకటేష్, సూడం రమణయ్య, జి.శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని బుచ్చిరెడ్డిపాళెం ఆస్పత్రికి, నలుగురిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. 

చెల్లాచెదురైన అన్నం.. 
ఈ ప్రమాదంలో మరణించినవారంతా దువ్వూరు ఎస్సీ కాలనీ వారే. చీకటితోనే బయలుదేరి వెళ్లి పని మొదలుపెట్టే ముందు తినేందుకు బాక్సుల్లో అన్నం పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో బాక్సులు రోడ్డుపై పడి అన్నం చెల్లాచెదురైంది. తెచ్చుకున్న అన్నం తినే అవకాశం కూడా లేకుండానే మరణించారంటూ.. కాలనీవాసులు విలపిస్తున్నారు. కూటికోసం కూలికెళుతుంటే.. బతుకులే పోయాయంటూ ఆయా కుటుంబాలు రోదిస్తున్న తీరు అందరికంట కన్నీరు పెట్టించింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాద స్థలాన్ని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సంగం తహసీల్దారు రవికుమార్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంగం ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

గవర్నర్, మంత్రి మేకపాటి సంతాపం
నెల్లూరు జిల్లా దువ్వూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం తనను కలచివేసిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. గాయపడినవారికి అత్యవసర వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల్లో కొందరికి ఫోన్‌చేసి పరామర్శించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top