నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం

Firing On Own Brother Created Sensation At Nallapureddypalle - Sakshi

వైఎస్సార్‌ సీపీ నేత శివప్రసాద్‌రెడ్డిపై మచ్చుకత్తితో దాడికి తమ్ముడి యత్నం 

ఆత్మరక్షణకు కాల్పులు.. తమ్ముడు పార్థసారథిరెడ్డి మృతి

ఆ వెంటనే మనస్తాపంతో  కాల్చుకుని అన్న ఆత్మహత్య

పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో మంగళవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కొమ్మా శివప్రసాద్‌రెడ్డి(60), ఆయనకు సోదరుడి వరుసైన భూమిరెడ్డి పార్థసారథిరెడ్డి(45)లు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. శివప్రసాద్‌రెడ్డి, పార్థసారథిరెడ్డిలు నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఎదురెదురుగా ఉన్న ఇళ్లలో నివాసముండేవారు. పార్థసారథిరెడ్డి గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. అయితే  కొంత కాలంగా ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు. భార్యతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించి కొమ్మా శివప్రసాద్‌రెడ్డి పంచాయితీ చేశారు. పంచాయితీలో పార్థసారథిరెడ్డి తన భార్యను అందరి ముందే తిడుతుండగా ఇది సరికాదంటూ శివప్రసాద్‌రెడ్డి పార్థసారథిరెడ్డిపై చేయి చేసుకున్నాడు. ఇది మనసులో పెట్టుకుని తనకు అనుకూలంగా పంచాయితీ చేయకపోగా, చేయి చేసుకున్నాడన్న కోపంతో కొమ్మా శివప్రసాద్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నాడు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో కొమ్మా శివప్రసాద్‌రెడ్డికి పోటీగా పార్థసారథిరెడ్డి నామినేషన్‌ వేయాలని ప్రయత్నించి, ఎవరూ మద్దతు పలకకపోవడంతో విరమించుకున్నాడు.  కొమ్మా శివప్రసాద్‌రెడ్డిని తరచూ దుర్భాషలాడేవాడు. 2019లో ఒకసారి కొమ్మా శివప్రసాద్‌రెడ్డి ఇంటిపై పెట్రోలు పోసి దాడి చేశాడు. ఈ నేపథ్యంలో కొమ్మా శివప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పార్థసారథిరెడ్డిపై అప్పట్లో పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

కాలుస్తావా.. దమ్ముంటే కాల్చు..
కొద్దిరోజులుగా శివప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ, చంపుతానంటూ బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పార్థసారథిరెడ్డి వీధిలోకి వచ్చి శివప్రసాద్‌రెడ్డిని బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. ఇంతలో శివప్రసాద్‌రెడ్డి కొడుకు ఉమేష్‌ మహేశ్వరరెడ్డి వచ్చి వీధిలో గొడవ చేయొద్దని చెప్పి ఇంటిలోకి వెళ్లిపోయాడు. ఇంతలో మరింత రెచ్చిపోయిన పార్థసారథిరెడ్డి, మచ్చుకత్తితో శివప్రసాద్‌రెడ్డి ఇంటి గేటు దాటుకుని లోపలికి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో శివప్రసాద్‌రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్‌ రివాల్వర్‌ తీసుకుని తొలుత గాలిలోకి కాల్పులు జరిపాడు. దమ్ముంటే తనను కాల్చాలంటూ పార్థసారథిరెడ్డి బూతులు తిడుతూ రెచ్చగొట్టాడు. దీంతో శివప్రసాద్‌రెడ్డి నేరుగా కాల్పులు జరపగా, పార్థసారథిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

తన కళ్ల ఎదుటే పార్థసారథిరెడ్డి మృతి చెందడంతో మనస్తాపానికి గురైన శివప్రసాద్‌రెడ్డి తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని శివప్రసాద్‌రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top