ప్రేమ వ్యవహారం: యువకుడి తండ్రిని కత్తితో పొడిచి హత్య | Father Deceased Over Son Love Marriage Issue | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారం: యువకుడి తండ్రిని కత్తితో పొడిచి హత్య

Apr 8 2021 12:48 PM | Updated on Apr 8 2021 3:39 PM

Father Deceased Over Son Love Marriage Issue - Sakshi

సాక్షి, చెన్నై: తనయుడి ప్రేమ వివాహం ఓ తండ్రి ప్రాణాన్ని బలితీసుకుంది. బంధువు అని కనికరం కూడా లేకుండా యువతి తండ్రే అతికిరాతకంగా యువకుడి తండ్రిని హత్య చేశాడు. వివరాలు.. సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం పుదుపాళయానికి చెందిన తంగవేల్‌(55)కు కుమారులు పెరియన్నన్‌(32), ప్రకాష్‌(24) ఉన్నారు. కొంగనాపురంలోని తంగవేల్‌ సమీప బంధువు సెల్వం కుమార్తె సంధ్య, ప్రకాష్‌ ప్రేమించుకుంటున్నారు. మార్చిలో ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. అదే నెల 24న ఓ ఆలయంలో వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు, గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి సంధ్యను ఆమె తండ్రి సెల్వంకు అప్పగించారు. ఈ క్రమంలో 29వ తేదీ మరోసారి వెళ్లిపోయారు.

ఆగ్రహానికి గురైన సెల్వం వారం రోజుల్లో తన కుమార్తెను అప్పగించాలని యువకుడి తండ్రి తంగవేల్‌ను హెచ్చరించాడు. ఆందోళన గురైన తంగవేల్‌ పోలీసులను ఆశ్రయించారు. ఎన్నికల అనంతరం పంచాయితీ పెడతామని పోలీసులు ఆయనకు నచ్చజెప్పిపంపారు. మంగళవారం రాత్రి పుదుపాళయానికి వచ్చిన సెల్వం, అతని బంధువులు సంధ్య ఆచూకీ కోసం తంగవేల్, ఆయన పెద్దకుమారుడు పెరియన్నన్‌ను నిలదీశారు. కోపోద్రిక్తుడైన సెల్వం తంగవేల్, పెరియన్నన్‌పై కత్తితో దాడి చేశారు. స్థానికులు అక్కడికి రావడంతో సెల్వం పారిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో తంగవేలు మృతి చెందాడు. పెరియన్నన్‌ చికిత్స పొందుతున్నాడు. పోలీసుల తీరుపై తంగవేలు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్వం, బంధువుల కోసం గాలిస్తున్నారు. 
చదవండి: పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య

Advertisement
 
Advertisement
Advertisement