తండ్రి కొడుకులను మింగిన కొత్త బావి

Father And Son Dies Of Fell In Well Adilabad - Sakshi

సాక్షి,సిరికొండ (బోథ్‌): వ్యవసాయం కోసం చేనులో తవ్వుకున్న బావి తమకే మృత్యుకుహరం అవుతుందని ఊహించలేదు ఆ కుటుంబం. కొత్తగా తవ్వుకున్న బావి పూజ కోసం వెళ్లి అందులో ప్రమాదవశాత్తుపడి తండ్రీ కొడుకులిద్దరూ మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని పోచంపల్లి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇంటి పెద్దతో పాటు కుమారుడు సైతం దూరం కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాడావి సోనేరావ్‌ (46) తన చేనులో కొద్ది రోజుల క్రితం బావిని తవ్వించాడు.

అందులో నీళ్లు పుష్కలంగా రావడంతో సంతోషపడ్డాడు. శుక్రవారం తన చిన్న కూతురు శైలజతో కలసి పూజ చేద్దామని బావి వద్దకు వెళ్లాడు. నీళ్లు తెచ్చేందుకు ఓ చెంబుతో బావిలోకి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడ్డాడు. ఇది గమనించిన కూతురు వెంటనే గ్రామంలోని ఇంటి వద్దకు వెళ్లి తన రెండో అన్న సూర్యభాన్‌ (20)కు ఈ విషయం చెప్పింది. వెంటనే అతడు అక్కడికి వచ్చి తండ్రిని కాపాడేందుకు బావిలోకి దూకాడు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ మునిగిపోయారు. గ్రామస్తులు వచ్చి వారిని బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందారు. సోనేరావ్‌కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top