Sakshi News home page

చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్‌ కారులో వచ్చి..

Published Sun, Oct 23 2022 4:12 PM

Fake Civil Supplies Officer Arrested In East Godavari District - Sakshi

నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా): ఆమె చదివింది ఏడో తరగతి. అయినా వివిధ శాఖల అధికారినంటూ ప్రజలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడింది. శనివారం దూబచర్లలో బేకరీ, భోజన హోటల్‌ను చెక్‌ చేసి వసూళ్లకు పాల్పడుతుండగా సివిల్‌ సప్లయిస్‌ డీటీ సుజాత, వారి సిబ్బంది ఈ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాడేపల్లిగూడేనికి చెందిన కాళ్ల రమాదేవి నేషనల్‌ కన్సూ్యమర్‌ రైట్స్‌ కమిషన్‌ మహిళా చైర్‌పర్సన్‌గా ఐడీ కార్డుతో తన షిఫ్ట్‌ డిజైర్‌ కారులో వివిధ ప్రాంతాలలో సివిల్‌ సప్లయిస్‌ అధికారిగా, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరిస్తూ హోటళ్లు, బేకరీలపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకుంటోంది.
చదవండి: ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్‌ చేస్తూ..

ఈ విషయం సివిల్‌ సప్లయిస్‌ అధికారుల దృష్టికి రాగా కొంతకాలంగా ఆమె కోసం గాలిస్తున్నారు. శనివారం దూబచర్లలో బెంగళూరు బేకరీకి వెళ్లి గృహ వినియోగ గ్యాస్‌ వ్యాపారానికి వినియోగిస్తున్నారంటూ బెదిరించి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా యజమాని ప్రదీప్‌ రూ.3 వేలు ఇచ్చాడు. అదే గ్రామంలో శివాలయం దగ్గర భోజన హోటల్‌కు వెళ్లి వంటకు వినియోగిస్తున్న రెండు గ్యాస్‌ సిలిండర్లు సీజ్‌ చేస్తానని బెదించింది.

కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు ఇవ్వాలంది. యజమాని ముగ్గాల సర్వేశ్వరరావు రూ.2 వేలు ఇచ్చాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన ఆ గ్రామ వీఆర్‌ఏ రవి తమ సివిల్‌ సప్లయిస్‌ డీటీ సుజాతకు సమాచారం అందించి నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ద్వారకా తిరుమలకు చెందిన చెల్లా ఏసు తప్పించుకుని పారిపోయాడు. పారిపోయిన చెల్లా ఏసుపై, ఆమె కారు డ్రైవరు దూబచర్ల గాంధీకాలనీకి చెందిన బోడిగడ్ల బాలరాజును, నకిలీ అధికారి రమాదేవిపై సీఐ లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement